Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వందశాతం అమలు చేస్తాం…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వందశాతం అమలు చేస్తాం

  • క్రిస్మస్ కానుకల పంపిణీ సభలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం : ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు వంద శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి క్రిస్టమస్ బహుమతుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన వారి సంబంధికులకు ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు. అనేకమంది ఇండ్లు అడుగుతున్నారన్నారు. ధరణితో ఇబ్బందులు పడుతున్నారని, ఇండ్ల మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా అందరికి న్యాయం చేస్తానన్నారు. ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు తీసుకొని వెళ్లారని ఆయన అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను తప్పక నెరవేర్చుతామని అన్నారు. అక్రమ కేసులు అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామని తెలిపినట్లు, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసినట్లు ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో తీపి వార్త వింటారని, హామీల్లో కొన్ని అమలుచేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల 734 కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆయన అన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒప్పచెప్పినట్లు మంత్రి అన్నారు. ఎన్ని అప్పులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. గతంలో ఆగి పోయిన పనులకు సంబంధించి అధికారులకు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఏ ఒక్క అధికారికి డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇవ్వమని తెలిపారు. ప్రజల నుంచి అధికారులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలని, మంచి పరిపాలన అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంత్రి కేక్ కట్ చేశారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, విద్యుత్ శాఖ ఎడిఇ కొక్యా నాయక్, పాలేరు నియోజకవర్గ మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ఎంపిపి లు, జెడ్పిటిసిలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చేతికి జైకొట్టారా …? కారుకు సై అన్నారా…? ఓటర్ దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana

పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ ఖాయం : సీపీఐ నేత కూనంనేని

Ram Narayana

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

Leave a Comment