- అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం
- ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి
- ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన
- త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశం పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు.
ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు.
2024 జనవరి 22… ఇది సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాముడు నాడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారింది, మళ్లీ ఇప్పుడు మారిందని వివరించారు. అయితే, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడ్ని వేడుకుంటున్నానని వెల్లడించారు.
ఈ క్షణం కోసం అయోధ్య ప్రజానీకం వందల ఏళ్లు నిరీక్షించిందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం సాగించామని వివరించారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
“రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారు. భారత న్యాయవ్యవస్థ వారి స్వప్నాన్ని సాకారం చేసింది. ఈ క్షణం దేశ ప్రజల సహనానికి, పరిపక్వతకు నిదర్శనం. అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి నేడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజ్యాంగబద్ధంగానే రామాలయం నిర్మించాం.
దేశమంతా ఈ రోజు దీపావళి జరుపుకోవాలి. దేశంలోని ప్రతి ఇంట్లో ఇవాళ రాముడి పేరిట దీపాలు వెలగాలి. భారతదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడు అనుసరించిన ఆదర్శం, క్రమశిక్షణ, విలువలు మనకు పునాదులు, అవే మనకు శిరోధార్యం.
వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం… రాముడే భారత్ విధానం… నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు… భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ” అంటూ ప్రధాని మోదీ వివరించారు.
రామాలయ నిర్మాణంతో మన పని పూర్తి కాలేదు: ప్రధాని మోదీ
శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో బాల రాముడు కొలువైన చారిత్రక ఘట్టం పూర్తయింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్వ శక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్… రామ్ సే రాష్ట్ర్… ఇదే మన కొత్త నినాదం అని పేర్కొన్నారు. దేశ సర్వోన్నత అభివృద్ధికి అయోధ్య రామ మందిరం చిహ్నం కావాలని అభిలషించారు. కాగా, అయోధ్య రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కరించారు.
ప్రధాని మోదీ నాకు చాలాకాలంగా తెలుసు.. ఆయన గొప్ప తపస్వి: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
- రామమందిరం ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రసంగించిన ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్
- ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీ కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టారన్న మోహన్ భగవత్
- ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ ఉద్భవిస్తోందని వ్యాఖ్య
ప్రధాని నరేంద్రమోదీ చాలాకాలంగా తనకు తెలుసునని… ఆయన గొప్ప తపస్వి అని ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని కఠినమైన ఉపవాసదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రధాని ఒక తపస్వి.. కానీ ఆయన ఒక్కరే చేయలేరు.. మనం కూడా మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అయోధ్యలో రామ్ లల్లాతో భారత్ ప్రతిష్ఠ తిరిగి వచ్చినట్లయిందన్నారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ కచ్చితంగా ఉద్భవిస్తోందన్నారు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయన్నారు. రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడమే మన ధర్మం అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు.
భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైంది… ఇప్పుడిక అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు ఉండవు: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్l
- అయోధ్యలో రాముడికి స్థానం కల్పించడం కోసం వందల సంవత్సరాలు పోరాడాల్సి వచ్చిందని వ్యాఖ్య
- ప్రాణప్రతిష్ఠ రోజున దేశమంతా రామమయం అయిందన్న యోగి
- రాముడి ఆలయం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్న యూపీ ముఖ్యమంత్రి
అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆయన మాట్లాడుతూ… ఒక ప్రధాన సమాజం తమ దేవుడికి అయోధ్యలో సరైన స్థానం కల్పించడం కోసం వందల సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందన్నారు. హిందువులు తమ రాముడికి గుడి నిర్మించడం కోసం 500 ఏళ్లు కష్టపడవలసి రావడం చరిత్రలోనే తొలిసారి అన్నారు. 1990లలో కరసేవకులపై కాల్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడిక అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని అన్నారు.
రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున దేశమంతా రామమయంగా మారిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీని యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. అయోధ్యకు పూర్వ వైభవం తీసుకు రావడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత అద్భుత ఘట్టం సాకారమైందన్నారు.
1990 అక్టోబర్‌లో అయోధ్యలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో 17 మంది చనిపోయారు. ఈ ఘటనను గుర్తు చేస్తూ రాముడి ఆలయం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. హిందువులు, దేవుడు కోరుకున్న చోట ఆలయం నిర్మితమైందన్నారు. ఈ క్షణం కోసం దేశమంతా ఎదురు చూసిందన్నారు.