- తొలి ప్రతిని స్థానాచార్యులు స్థలసాయికి అందజేత
- ఆధ్యాత్మిక సంస్థ జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవలకు అభినందనలు
- శ్రీనివాస్ శైలి, అద్భుతమైన గ్రంథ ముద్రణా సొగసులు పాఠకుల మనసులు కొల్లగొడతాయన్న దేవస్థానం ప్రధానాచార్యలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీరామ నవమి వసంతోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో ప్రముఖ రచయిత, దేవాదాయ ధర్మాదాశాఖ అధికారిక మాసపత్రిక ‘ఆరాధన‘ పూర్వ సంపాదకుడు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శ్రీరామ రక్షాస్తోత్రమ్’ గ్రంథాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్‌చార్జ్ ఈవో రమాదేవి ఆవిష్కరించారు. శోభాయమానంగా, పవిత్ర వ్యాఖ్యానాలతో అందించిన ఈ గ్రంథం తొలి ప్రతిని దేవస్థానం స్థానాచార్యాలు స్థలసాయికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరామచంద్రుని కీర్తించి మహా విజయాలను పొందే అత్యద్భుత శ్రీరామ రక్షాస్తోత్రాన్ని నవమి ఉత్సవాల్లో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక సంస్థ జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవలను అభినందించారు.
దేవస్థానం ప్రధానాచార్యలు పి.సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ.. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని భక్త ప్రపంచానికి అందించిన మొదటి ఘనత ఆధ్యాత్మికవేత్త, రచయిత పురాణపండ రాధాకృష్ణమూర్తిదేనని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు పురాణపండ శ్రీనివాస్ అత్యంత వేగంగా చేస్తున్న ఆద్యాత్మిక గ్రంథ రచనా కృషి ఆశ్చర్యపరుస్తోందని కొనియాడారు. శ్రీనివాస్ శైలి, అద్భుతమైన గ్రంథ ముద్రణా సొగసులు పాఠకుల మనసులు కొల్లగొడతాయని ప్రశంసించారు. స్థానాచార్యలు స్థలసాయి మాట్లాడుతూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని జీవితానికి గొప్ప ఆత్మశక్తిగా అభివర్ణించారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అన్నెం శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ గ్రంథాన్ని రామయ్య భక్తులకు పంపిణీ చేయనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.