జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
బీటెక్ సీట్ల భర్తీకి మూడు విడతల ప్రవేశాలు
చివరి విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్
ఈసారి బ్రాంచి మారినా బోధనా రుసుములకు అర్హులే
ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి జూన్ 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సెలింగ్ జులై 16వ తేదీకి, రెండో విడత అదే నెల 26వ తేదీకి, చివరి విడత ఆగస్టు 7కి ముగియనుంది.గతానికి భిన్నంగా ఈసారి ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి విద్యార్థులు మారేందుకు కన్వీనర్ ఆధ్వర్యంలోనే అంతర్గత స్లైడింగ్ జరగనుంది.ఈ మేరకు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కన్వీనర్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు జూన్ 10వ తేదీకి అనుమతులు జారీ చేస్తుంది.
తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు వాటికి అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంటుంది. వాటిని మాత్రమే కౌన్సెలింగ్‌లో చేరుస్తారు. ఆ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని, ఆ తర్వాత జూన్ 27 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ ఎలకేషన్(జోసా) కమిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10 నుంచి ప్రారంభమవుతుంది.
అది 30 లేదా 35 రోజులు జరుగుతుంది. అంటే జులై రెండో వారం నాటికి ముగుస్తుంది. ఆ తేదీలను పరిగణనలోకి తీసుకొని ఎప్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను జులై 19 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తానికి ఆగస్టు 8 నాటికి చివరి విడత కౌన్సెలింగ్… 17 నాటికి అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
యాజమాన్యాల అక్రమాలకు చెక్
ఇప్పటివరకు చివరి విడత కౌన్సెలింగ్ తర్వాత జరిగే అంతర్గత స్లైడింగ్‌ను ఆయా కళాశాలలే నిర్వహించేవి. ఇతర చోట్ల సీట్లు వచ్చిన వారు వెళ్లగా.. భర్తీ కాకుండా మిగిలిన సీట్లలో డిమాండ్ ఉన్నవి చూపకుండా స్లైడింగ్ నిర్వహిస్తున్నారని, తర్వాత వాటిని స్పాట్ కౌన్సెలింగ్‌లో రూ.లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈక్రమంలో స్లైడింగ్ దందాకు కళ్లెం పడేనా? అనే శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎప్‌సెట్ కన్వీనర్ బుర్రా వెంకటేశం ఈసారి నుంచి స్లైడింగ్‌ను కన్వీనర్ ద్వారా జరపాలని ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కొందరు అభ్యంతరం చెప్పినా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించి ఆమోదం తెలిపినట్లు సమాచారం
స్లైడింగ్‌లో బ్రాంచి మారినా వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. బీ కేటగిరీ సీట్లపైనా చర్చించినా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ ఆచార్య విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వర్‌రావు, ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య డీన్‌కుమార్, ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు …
రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత విద్యార్థులు స్వయంగా వెళ్లి కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఒరిజనల్ టీసీ ఇవ్వాలి. రిపోర్ట్ చేయకుంటే చివరి విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీలుండదు. కొత్తగా రిజిస్ట్రేషన్‌కు కూడా అనుమతించరు
అంతర్గత స్లైడింగ్ తర్వాత సీటు పొందిన వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం, సీటును రద్దు చేసుకోవడం చేయరాదు. ఒకవేళ చేసినా ఆ సీట్లను స్పాట్‌లో భర్తీ చేయడానికి అనుమతించరు. వాటిని తర్వాత విద్యా సంవత్సరం ఈసెట్ ద్వారా వచ్చే పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ(రెండో ఏడాది)లో భర్తీ చేస్తారు