- లక్షన్నర లోపు రుణాల మాఫీకి నిధుల విడుదల
- 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ
- అసెంబ్లీ ప్రాంగణంలో నిధులు విడుదల చేసిన సీఎం
రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
లక్ష నుంచి లక్షన్నర రూపాయల లోపు రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరినట్లు ప్రభుత్వం పేర్కొంది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రెండు విడతల్లో కలిసి అత్యధికంగా నల్గొండ జిల్లాలోని 1,37,430 మంది రైతులకు రూ.984.34 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత స్థానంలో 80,395 మంది రైతులకు లబ్ధి చేకూరడం ద్వారా నాగర్ కర్నూల్ రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాకు రూ.583.87 కోట్లు విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 77,951 మంది లబ్ది పొందారు. ఈ జిల్లాకు రూ. 563.99 కోట్ల నిధులు విడుదలయ్యాయి. చివరి మూడు స్థానాల్లో ములుగు (17,788 మంది రైతులకు రూ. 130.94 కోట్లు), మేడ్చల్ మల్కాజ్‌గిరి (2,799 మంది రైతులకు రూ.15.56 కోట్లు), హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్‌లో మొదటి విడతలో ముగ్గురు, రెండో విడతలో నలుగురు రైతులకు లబ్ధి చేకూరింది.