- చైనాను తీవ్రంగా వేధిస్తున్న జనాభా సంక్షోభం
- జననాల రేటు గణనీయంగా తగ్గడంతో విద్యతో పాటు వివిధ రంగాలపై ప్రభావం
- పిల్లలులేక దేశవ్యాప్తంగా మూతపడుతున్న వేలాది స్కూళ్లు
- 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్‌గార్టెన్ల మూసివేత
- మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్న వైనం
చైనాను కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం వేధిస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడం, అదే సమయంలో వృద్ధ జనాభా పెరగడం జరుగుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు విద్యతో పాటు పలు రంగాలపై పడుతున్నట్లు సమాచారం. బర్త్ రేటు పడిపోవడంతో పిల్లలులేక దేశవ్యాప్తంగా వేలాది స్కూళ్లు మూతపడుతున్నట్లు తాజాగా నివేదిక తెలిపింది.
గతేడాది దేశవ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్లు మూసివేసినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. స్కూళ్లల్లో చేరే విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే 11 శాతం తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అలాగే గతేడాది 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు నివేదిక పేర్కొంది.
ఇక జనాభా పరంగా చైనా ప్రస్తుతం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల, సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోతుండగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఆ దేశ జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. 2023లో జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్లు తెలుస్తోంది. గతేడాదిలో చైనా వ్యాప్తంగా 90 లక్షల జననాలు జరిగాయి. అయితే, 1949 తర్వాత ఆ దేశంలో ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇక 2023 నాటికి 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లు, 2025 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. దాంతో మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు.