- ఘజియాబాద్ జిల్లా కోర్టులో అనూహ్య ఘటన
- ఓ బెయిల్ విషయంలో వాగ్వాదం
- జడ్జికి వ్యతిరేకంగా ఆయన ఛాంబర్‌లోకి దూసుకెళ్లిన న్యాయవాదులు
- పోలీసులు వచ్చి న్యాయవాదులను బయటకు పరుగెత్తించిన వైనం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ బెయిల్ పిటిషన్ విషయంలో న్యాయమూర్తి, న్యాయవాది మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం కోర్టులో ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. జడ్జికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ఛాంబర్‌లోకి లాయర్లు దూసుకెళ్లారు. జడ్జితో గొడవకు దిగారు. కాసేపు రచ్చ రచ్చ చేశారు.
దీంతో పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుర్చీలు పట్టుకుని మరీ న్యాయవాదులను అక్కడి నుంచి బయటకు తరిమారు. న్యాయవాదులను పోలీసులు వెంబడించినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.
ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చివరికి పారామిలటరీ సిబ్బందిని కూడా మోహరించాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనలో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. దీంతో స్థానిక బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.