- 2 వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశాలు
- లగచర్లకు అధికారుల బృందాన్ని పంపించనున్నట్లు వెల్లడి
- ఈ నెల 18న ఎన్‌హెచ్ఆర్‌సీకి బాధితుల ఫిర్యాదు
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపించాలని కూడా నిర్ణయించింది.
ఫార్మా కంపెనీ భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 18న ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మానవ హక్కుల కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వడానికి నిరాకరిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారని, బాధితుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఉన్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో పోలీసులు తమను వేధిస్తారనే భయంతో చాలామంది గ్రామస్థులు ఊరి నుంచి బయటకు వచ్చి ఉంటున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో, రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది.