మమతా మెడికల్ కాలేజీకి కామ్రేడ్ పోటు ప్రసాద్ మృతదేహం డొనేట్!
శుక్రవారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయంలో పోటు ప్రసాద్ సంతాప సభ
సంతాపసభలో వివిధ రాజకీయ పార్టీలనాయకులు పాల్గొంటారు
11 గంటలకు సిపిఐ కార్యాలయం నుంచి మమతా కాలేజీ వరకు అంతిమ యాత్ర
రెండు రోజుల క్రితం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బ్యాండ్ పై వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యుల సమ్మతి మేరకు మమతా మెడికల్ కాలేజీకి డొనేట్ చేయనున్నారు … బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ప్రసాద్ భౌతికకాయాన్ని ఉంచారు ..ఆయన కుమారుడు అమెరికాలో ఉండటంతో ఆయన వచ్చిన వెంటనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు …
పోటు ప్రసాద్ సంతాప సభ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సిపిఐ కార్యాలయంలో జరుగుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రసాద్ మృతదేహన్ని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచుతారని సురేష్ తెలిపారు. సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహ సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొంటారన్నారు. 11 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. సిపిఐ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్, ఐటీ హబ్ సెంటర్, మమత రోడ్డు మీదుగా అంతిమ యాత్ర మమత ఆసుపత్రికి చేరుకుంటుందని సురేష్ తెలిపారు. ప్రసాద్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం మమత ఆసుపత్రికి బహూకరించారన్నారు. కమ్యూనిస్టు శ్రేణులు, ప్రసాద్ అభిమానులు పాల్గొని ప్రసాద్ కు కడసారి నివాళులర్పించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.