తెలుగు రాష్ట్రాలకు మణిహారం …ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే
తగ్గనున్న విశాఖ -హైద్రాబాద్ దూరం
త్వరలో ఈ రహదారి గుండా రయ్…రయ్ మని పరుగులు పెట్టనున్న వాహనాలు
ఖమ్మం, దేవరపల్లిని కలుపుతూ నిర్మిస్తున్న నూతన రహదారి వేగంగా పూర్తవుతోంది. ఈ 165 కిలోమీటర్ల రహదారి తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అండర్‌పాస్‌లు, వంతెనలు, ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్లు నిర్మిస్తున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆగస్టు 15 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ..
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ హైవే..
గ్రీన్ ఫీల్డ్ హైవే పైన ఈ రెండు ప్రదేశాల్లో (దేవరపల్లి, ఖమ్మం) మాత్రమే టోల్ గేట్ ఉంటాయి. మిగతా 10 చోట్ల సర్వీస్ రోడ్డు పైన ఎంట్రీ & ఎగ్జిట్ ఏర్పాటు చేస్తున్నారు
ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళ్లేందుకు పొన్నెకల్లు దగ్గర ఒక ఎగ్జిట్ ,ఎంట్రన్స్ తోపాటు మరో 9 చోట్ల ఎంట్రన్స్ ,ఎగ్జిట్ ఉంటాయి…
1 .పొన్నెకల్లు (ఖమ్మం రూరల్)
- వెంకటగిరి (ఖమ్మం రూరల్)
- ధంసలాపురం(ఖమ్మం)
- సోమవరం (వైరా)
- లింగాల (కల్లూరు)
- చింతగూడెం (తిరువూరు)
- వేంసూరు (సత్తుపల్లి)
- రేచర్ల (చింతలపూడి)
- దేవులపల్లి (జంగారెడ్డిగూడెం)
10 . పొంగుటూరు (కొయ్యలగూడెం)… ల దగ్గర
ఎంట్రీ మరియి ఎగ్జిట్ ఉంటాయి…ఎక్కడ లేని విధంగా రోడ్ మొత్తం పక్కనే సర్వీస్ రోడ్ ఏర్పాటు చేశారు …
ఖమ్మం, దేవరపల్లిని కలుపుతూ నిర్మిస్తున్న ఈ నూతన రహదారి వేగంగా పూర్తవుతోంది. దాదాపు రూ.3,573 కోట్ల వ్యయంతో 165 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్యాకేజీలు, 117 అండర్‌పాస్‌లు, 33 కల్వర్టులు, తొమ్మిది భారీ వంతెనల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయి.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం తక్కువ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చేరుకోవచ్చు. అదేవిధంగా.. విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ మీదుగా కాకుండా ఖమ్మం మీదుగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకోవడానికి విజయవాడ మీదుగా 670 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే, విజయవాడ మీదుగా వెళ్లకుండా నేరుగా 550 కిలోమీటర్లు ప్రయాణించి 8 గంటల్లోనే హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణ దూరం 120 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 4 గంటలు తగ్గుతుంది. ప్రయాణికులు ట్రాఫిక్ కష్టాలు లేకుండా.. సులభంగా ప్రయాణం సాగించవచ్చు.
హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య ఖమ్మం జిల్లా మీదుగా నిర్మిస్తున్న ఈ రహదారి తెలుగు రాష్ట్రాలకు ఒక ముఖ్యమైన రవాణా మార్గంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఖమ్మం నుండి సూర్యాపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి నుండి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల రహదారి ఉంది. ప్రస్తుతం ఖమ్మం నుండి దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది.
ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి తెలుగు రాష్ట్రాలకు ఒక మణిహారంలాంటిది. ఈ రహదారి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు తలెత్తకుండా సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు . ఖమ్మం మునేరు పైన ,బ్రిడ్జి నిర్మాణం పూర్తీ కావాల్సి ఉంది .. అక్కడ కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి…మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఈ రోడ్ పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తీ చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు …