మహాటీవీ ఆఫీసుపై దాడి.. తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి…
మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన
తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమర్థనీయం కాదన్న ముఖ్యమంత్రి
దాడిని ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మహాటీవీ కార్యాలయంపై శనివారం హైద్రాబాద్ లో జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది …బీఆర్ యస్ కు చెందిన వారు దాడి చేసి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశారని . దొరికితే హత్య చేయడానికి కూడా సిద్దమై ఇనపరాడ్లు రాళ్ళతో వచ్చి కార్యాలయం తెలుపులు ధ్వంసం చేసారని , కిటికీలు పగల గొట్టారని , బయట పార్కింగ్ లో ఉన్న కార్లపై పెద్ద పెద్ద బండలతో దాడిచేసి ధ్వంసం చేసి తమ పైశాచిక ఆనందం పొందారని మహాటీవీ సీఎండీ వంశీ ఆరోపించారు …విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్ , పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయాన్ని సందర్శించి తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారని వారందరికీ కృతజ్నతలు తెలుపుతున్నట్లు వంశీ తెలిపారు ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దాడిని ఖండించారని భాద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారని అన్నారు ..జర్నలిస్ట్ సంఘాలు , రాజకీయ పార్టీల దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా వివిధ జిల్లాలో నిరసనలు తెలిపాయి.. దాడిని ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ ,జాతీయ కార్యదర్శి వై .నరేందర్ రెడ్డి , టీయూడబ్ల్యూజే అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి కె .విరహత్ అలీ , కె. రాంనారాయణలు ఖండించారు …భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ..
సీఎం రేవంత్ రెడ్డి ఖండన …
ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. మీడియా సంస్థపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులకు ఏమాత్రం తావులేదని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
మహా న్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి స్థానం లేదని, మీడియా సంస్థలపై దాడులు చేయడం అంటే ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశంతో కూడిన చర్య అని ఆయన అన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ ఘటనను నిర్దాక్షిణ్యంగా చూడాలని, ఈ దాడిలో పాలుపంచుకున్నవారితో పాటు, ఈ దాడి వెనుక నిలిచినవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సూచిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.
మహా న్యూస్ ఆఫీసుపై దాడి.. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

- హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయంపై దాడి
- ఘటనను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
- ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణన
- దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి సంఘీభావం ప్రకటన
హైదరాబాద్‌లోని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ‘మహా న్యూస్’ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తమ మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయంలోకి దుండగులు ప్రవేశించి విధ్వంసం సృష్టించడం అత్యంత దారుణమైన చర్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాత్మక ఘటనలకు ఏమాత్రం ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులు, దాడుల ద్వారా మీడియా గొంతును అణచివేయాలని చూడటాన్ని సమాజం ఎప్పటికీ అంగీకరించదని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మహా న్యూస్ యాజమాన్యానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు.
మరోవైపు, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజల వాణిని వినిపించే మీడియా సంస్థలపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించాలని అన్నారు. ప్రసారమయ్యే కథనాల పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేయడానికి లేదా వివరణ కోరడానికి చట్టబద్ధమైన మార్గాలున్నాయని గుర్తుచేశారు. వాటిని విడిచిపెట్టి భౌతిక దాడులకు పాల్పడటం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మహా న్యూస్ యాజమాన్యానికి లోకేశ్ తన సంఘీభావాన్ని తెలిపారు.
మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

- హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయంపై దాడి ఘటన
- స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- మీడియాపై దాడులు చేయడం సరికాదని హితవు
- వార్తలపై అభ్యంతరాలకు దాడులు పరిష్కారం కాదన్న పవన్
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ మార్గాలను అనుసరించకుండా, నేరుగా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు.
మహా న్యూస్ ఛానెల్‌పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా గొంతును నొక్కే ఇలాంటి ప్రయత్నాలను సహించరాదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ సూచించారు.
మహాన్యూస్ కార్యాలయంపై దాడి: ఆఫీస్‌కు వరుస కట్టిన రాజకీయ నాయకులు

- మహాన్యూస్ ఛానెల్ కార్యాలయానికి పోటెత్తిన రాజకీయ నేతలు
- పరామర్శించిన వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నం
- దాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన మంత్రి పొన్నం
- సీపీఐ, బీజేపీ నేతల నుంచి కూడా సంఘీభావం
- ధ్వంసమైన ఆఫీసును, వాహనాలను పరిశీలించిన నేతలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దాడికి గురైన ఛానెల్ కార్యాలయానికి వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని సందర్శించి, యాజమాన్యానికి ధైర్యం చెప్పారు.
హైదరాబాద్‌లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి ఘటన అనంతరం, శుక్రవారం పలువురు రాజకీయ ప్రముఖులు కార్యాలయాన్ని సందర్శించారు. వీరిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. వీరితో పాటు సీపీఐ జాతీయ నేత నారాయణ, బీజేపీ నాయకులు కూడా ఛానెల్‌కు మద్దతుగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం, దాడిలో ధ్వంసమైన ఫర్నిచర్, పగిలిపోయిన కిటికీల అద్దాలు, దెబ్బతిన్న కార్లను ఆయన ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. దాడి వల్ల జరిగిన నష్టం గురించి ఛానెల్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, ఈ దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
జర్నలిస్టులను చంపేస్తారా? అవసరమైతే కేటీఆర్ ఇంటికి వెళతా!: ‘మహాన్యూస్’ వంశీ

- నిరసనకు రాళ్లు, రాడ్లు ఎందుకని ప్రశ్నించిన ‘మహాన్యూస్’ వంశీ
- మహాన్యూస్ తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని వ్యాఖ్య
- కానీ దాడుల సంస్కృతి ఏమిటని నిలదీత
- నరికేస్తాం, చంపేస్తామని బెదిరించడం ఏమిటని ఆగ్రహం
హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారంటూ ఛానల్ ఎండీ వంశీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దాడిని ఖండించారు. నిరసన వ్యక్తం చేయాలనుకుంటే రాళ్లు, రాడ్లు వంటి ఆయుధాలు ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా కార్యాలయం ఎదుట నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఒకవేళ మహాన్యూస్ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి దాడులను ప్రజలు హర్షిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇరవై మందికి పైగా కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.
జర్నలిస్టులపై దాడులు చేస్తే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను చంపేస్తారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు. కొందరు ఈ దాడికి మద్దతు పలుకుతున్నారని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వారిని ఎవరు కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై మహాన్యూస్ తప్పకుండా పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అనుచరులని అర్థమవుతోందని వంశీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి, తమ నాయకుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారని దాడి చేసిన వారు నినాదాలు చేశారని ఆయన తెలిపారు. నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తామని బెదిరించారని ఆయన వాపోయారు. కేసీఆర్ నాయకత్వంలోని పార్టీలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజాన్ని ఎటువైపు తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు.
మేము ఏదైనా తప్పు చేసి ఉంటే నిలదీయవచ్చని వంశీ అన్నారు. అవసరమైతే తాను కేటీఆర్ ఇంటికి వెళతానని లేదా కేటీఆర్ తన స్టూడియోకు రావొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి ఘటనలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోందని, పోలీసు విచారణపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఓ జర్నలిస్టుగా తాను కోరుకోవడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. మీడియాపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.