- ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ట్రంప్
- పుతిన్‌కు 50 రోజులు డెడ్ లైన్ విధించిన ట్రంప్
- ఆ తర్వాత భారీ వడ్డనేనన్న ట్రంప్
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గడువు విధించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, 50 రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలోపు యుద్ధాన్ని ఆపకపోతే సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
వైట్‌హౌస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుతైతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వాణిజ్యాన్ని తాను చాలావాటికి వాడుకుంటుంటానని, యుద్ధాలను పరిష్కరించడానికి కూడా అవి ఉపయోగపడటం గొప్పగా ఉందంటూ, భారత్ – పాక్ ఘర్షణను ప్రస్తావించారు. పుతిన్‌పై ట్రంప్ మండిపడుతూ, ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు.
‘పుతిన్ పగలంతా మాట్లాడతారు. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు, ఆ ప్రవర్తన మాకు నచ్చట్లేదు’ అంటూ దుయ్యబట్టారు. యుద్ధం విషయంలో 50 రోజుల్లో ఒప్పందానికి రాకపోతే రష్యా ఊహించని సుంకాలు చెల్లించాల్సి వస్తుందని, ఆ సుంకాలు వంద శాతం దాటే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని ఇబ్బంది పడుతున్న రష్యా సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
యుద్ధాలను ఆపడంలో నేనే మొనగాడిని: ట్రంప్.. వీడియో ఇదిగో!

- భారత్ – పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ మరోమారు వ్యాఖ్య
- వర్తకంపై ఆంక్షల పేరుతో రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చా
- రువాండా – కాంగోల మధ్య సుదీర్ఘ వివాదాన్నీ పరిష్కరించానని ట్రంప్ వెల్లడి
దేశాల మధ్య యుద్ధాలను ఆపడంలో తనను మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తన చాతుర్యంతో తప్పించానని చెప్పారు. భారత్ – పాకిస్థాన్ ల మధ్య అణు యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే తప్పించేశానని మరోమారు పేర్కొన్నారు. ఇటీవల ఆ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయని, యుద్ధం ముదిరి అణ్వాయుధ ప్రయోగానికి దారి తీసే ముప్పు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. దీంతో తాను జోక్యం చేసుకుని ఇరు దేశాలను గట్టిగా హెచ్చరించినట్లు తెలిపారు.
యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని, భవిష్యత్తులో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోమని ఒత్తిడి చేశానని వివరించారు. దీంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని, ప్రపంచానికి మరో అణు యుద్ధ ముప్పు తప్పిందని ట్రంప్ తెలిపారు. రువాండా – కాంగోల మధ్య గడిచిన 30 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసని ట్రంప్ గుర్తుచేశారు. ఇందులో సుమారు 70 లక్షల మంది చనిపోయారని ట్రంప్ చెప్పారు. ఈ వివాదాన్ని కూడా తాను సమసిపోయేలా చేశానని చెప్పుకున్నారు. ఈమేరకు సోమవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయుధాలు ఇస్తే నువ్వు నేరుగా మాస్కోపై దాడి చేయగలవా?: జెలెన్ స్కీని అడిగిన ట్రంప్!

ఇటీవల ట్రంప్-పుతిన్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ
ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పుతిన్!
అనంతరం జెలెన్ స్కీతో ట్రంప్ కీలక చర్చలు!
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా శాంతి మంత్రం జపించిన ట్రంప్… ఇకపై రష్యాను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. జులై 4న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణలో, అవసరమైన ఆయుధాలు అందిస్తే మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లతో సహా రష్యా లోపల దాడులను తీవ్రతరం చేయగలరా? అని ట్రంప్ ప్రశ్నించినట్లు ఓ కథనం వచ్చింది.
ఆ కథనం ప్రకారం… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర నిరాశాజనకంగా ముగిసిన తర్వాత జెలెన్ స్కీతో ఈ చర్చ జరిగింది. కాల్పుల విరమణ చర్చలకు రష్యా నిరాకరించడంపై అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది సూచిస్తోంది. రష్యాను నేరుగా ఎదుర్కోవడానికి వెనుకడుగు వేస్తారన్న ట్రంప్ మునుపటి అభిప్రాయానికి ఇది భిన్నమైన వైఖరిగా భావిస్తున్నారు. రష్యన్లకు ఏదో విధంగా బాధ కలిగించి, వారిని చర్చలకు రప్పించడమే ట్రంప్ కొత్త వ్యూహమని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా, రష్యా భూభాగంపై మరింత దూకుడు దాడులకు పాశ్చాత్య దేశాలు, మరియు అమెరికా విధాన రూపకర్తలలో మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు కొత్త ఆయుధాలను అందిస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించడం, అలాగే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా ఎగుమతుల కొనుగోలుదారులపై ఆంక్షలు విధిస్తామని బెదిరించడం వంటి పరిణామాలు మాస్కో మొండి వైఖరి కారణంగానే చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.