- యుద్ధం ముగియాలంటే క్రిమియా, నాటో ఆశలు వదులుకోవాలన్న ట్రంప్
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సోషల్ మీడియా ద్వారా స్పష్టమైన సందేశం
- ఈ రోజు వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, ఐరోపా నేతలతో ట్రంప్ కీలక భేటీ
- పుతిన్ డిమాండ్లకే ట్రంప్ మొగ్గు చూపుతున్నారని ఐరోపా దేశాల ఆందోళన
- శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాలను వదులుకోవాలని అమెరికా సూచన
రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ రెండు కీలకమైన అంశాలను వదులుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను, నాటో కూటమిలో చేరాలనే ఆశను విరమించుకుంటే యుద్ధం దాదాపు తక్షణమే ముగిసిపోతుందని ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచించారు. ఈ రోజు జెలెన్‌స్కీ, పలువురు ఐరోపా అగ్రనేతలతో వైట్‌హౌస్‌లో జరగనున్న అత్యంత కీలక సమావేశానికి ముందు ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. “ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తలుచుకుంటే యుద్ధాన్ని వెంటనే ఆపవచ్చు. లేదా పోరాటాన్ని కొనసాగించవచ్చు. కానీ ఒబామా హయాంలో కోల్పోయిన క్రిమియా తిరిగి రాదు. ఉక్రెయిన్ నాటోలో చేరలేదు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు” అని ఆయన పేర్కొన్నారు. ఈ షరతులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పటినుంచో పెడుతున్న డిమాండ్లకు దగ్గరగా ఉండటంతో ఐరోపా దేశాల్లో ఆందోళన మొదలైంది.
సోమవారం జెలెన్‌స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వంటి అగ్రనేతలు వైట్‌హౌస్‌కు రానున్నారు. ఈ భేటీలో పుతిన్ షరతులను అంగీకరించేలా జెలెన్‌స్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకురావొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా ఎలాంటి భద్రతా హామీలు ఇస్తుందనే దానిపై స్పష్టత కోరాలని ఐరోపా నేతలు భావిస్తున్నారు.
ఇటీవలే అలస్కాలో ట్రంప్, పుతిన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత యుద్ధ విరమణ కాకుండా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంపై దృష్టి పెట్టినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం (దొనెట్స్క్, లుహాన్స్క్) పూర్తి నియంత్రణను రష్యాకు అప్పగించి, బదులుగా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా దాడులను నిలిపివేయాలనే ప్రతిపాదనను ట్రంప్ సమర్థించినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, పుతిన్ ఇచ్చే హామీల కంటే ట్రంప్ ఇచ్చే భద్రతా హామీలే తమకు ముఖ్యమని అన్నారు. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ, రష్యా ప్రతిపాదిస్తున్న శాంతి కేవలం ఉక్రెయిన్ లొంగిపోవడమే అవుతుందని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఏదేమైనా, ఈ రోజు జరగనున్న వైట్‌హౌస్ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది.
ట్రంప్ అలా.. జెలెన్ స్కీ ఇలా.. మీటింగ్ ఎలా జరగనుందో!

- కీలక భేటీ ముందు నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలు
- యుద్ధం ముగింపు నమ్మేటట్లు ఉండాలన్న జెలెన్‌స్కీ
- నాటో సభ్యత్వం, క్రిమియాల గురించి మర్చిపోవాలన్న ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ట్రంప్ భేటీ అయ్యారు. తాజాగా ఈ రోజు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీతో భేటీ కానున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటనపై యురోపియన్ యూనియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు, ట్రంప్ తో భేటీకి ముందు జెలెన్ స్కీ కూడా కీలక ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో ట్రంప్, జెలెన్ స్కీ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ కు మద్ధతుగా యురోపియన్ యూనియన్ దేశాధినేతలు కూడా పాల్గొంటుండడం విశేషం.
జెలెన్ స్కీ ఏమన్నారంటే..
ట్రంప్ తో భేటీ కోసం వాషింగ్టన్ కు చేరుకున్న జెలెన్ స్కీ.. రష్యాతో యుద్ధాన్ని ప్రపంచం నమ్మేలా ముగించాలని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ను కాపాడుకుంటాననే నమ్మకం తనకు ఉందని, తమ భద్రతకు స్పష్టమైన హామీ ఈ సమావేశంలో పొందుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ప్రారంభించిందే రష్యా.. కాబట్టి యుద్ధాన్ని ఆపేయాల్సింది కూడా అదేనని అన్నారు. యుద్ధం ఆపేయాలన్నది తమ బలమైన ఆకాంక్ష అని, ఉక్రెయిన్ ప్రజలు తమ భూమి కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, ఐరోపా నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ట్రంప్ ఏమన్నారంటే..
యుద్ధం ఆపడమా లేక కొనసాగించడమా అనేది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతుల్లోనే ఉంది. అయితే, రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిన క్రిమియా భూభాగాన్ని తిరిగి పొందాలన్న ఆలోచనతో పాటు నాటోలో చేరాలన్న కోరికను ఉక్రెయిన్ మర్చిపోవాల్సిందే. కొన్ని విషయాలను మార్చలేమని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.
భేటీలో పాల్గొంటున్నది వీరే..
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్
ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్
నాటో చీఫ్ మార్క్ రుట్టె