అంతర్జాతీయం

శాంతి చర్చల్లో కీలక ముందడుగు.. పుతిన్, జెలెన్‌స్కీ మీటింగ్‌కు ట్రంప్ యత్నం!

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకున్నారు. ఇది శాంతి దిశగా వేసిన చాలా మంచి, తొలి అడుగు అని ఆయన అభివర్ణించారు.

నిన్న వైట్‌హౌస్‌లో ఐరోపా దేశాల అధినేతలు, నాటో అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ భేటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తదితరులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీలపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

ఈ సమావేశం ముగిసిన వెంటనే తాను నేరుగా పుతిన్‌కు ఫోన్ చేసినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు. “నేను అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశాను. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య ఒక సమావేశానికి ఏర్పాట్లు ప్రారంభించాం. ఆ సమావేశం జరిగిన తర్వాత, ఇద్దరు అధ్యక్షులతో పాటు నేను కూడా పాల్గొనే త్రైపాక్షిక సమావేశం ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ భేటీకి సంబంధించిన ఏర్పాట్లను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కో, కీవ్‌లతో కలిసి పర్యవేక్షిస్తున్నారని ట్రంప్ వివరించారు. మరోవైపు, ట్రంప్‌తో పుతిన్ 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు ధ్రువీకరించాయి. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు కొనసాగించేందుకు ఇద్దరు నేతలు అంగీకరించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నిరంతరం సంప్రదింపులు జరపాలని కూడా వారు నిర్ణయించుకున్నారు.

పుతిన్‌కు గ్రాండ్ వెల్కమ్.. జెలెన్‌స్కీతో మొక్కుబడి మీటింగ్.. ట్రంప్ వింత దౌత్యం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల వ్యవధిలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఆయన జరిపిన సమావేశాల్లో కనబరిచిన వైరుధ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరికి రాచమర్యాదలు చేసి, మరొకరిని సాధారణంగా పలకరించడం ద్వారా ట్రంప్ తన దౌత్యంలో వింత పోకడలను ప్రదర్శిస్తున్నారు.

ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ అలాస్కాలో సమావేశమయ్యారు. ఈ భేటీ అత్యంత అట్టహాసంగా జరిగింది. అమెరికాకు చెందిన బి-2 స్టెల్త్ బాంబర్లు, ఎఫ్-22 రాప్టర్ యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తుండగా పుతిన్‌కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, కరచాలనం చేసుకుని కెమెరాలకు పోజులిచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ అయిన వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం విశేషం. కొన్ని రోజుల క్రితం వరకు పుతిన్‌ను ‘పిచ్చివాడు’ అని విమర్శించిన ట్రంప్, ఒక్కసారిగా ఆయనకు ఇంతటి గౌరవం ఇవ్వడం గమనార్హం.

జెలెన్‌స్కీతో సాధారణ భేటీ
పుతిన్‌తో భేటీ తర్వాత వాషింగ్టన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ అత్యంత నిరాడంబరంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా ముగిసింది. జెలెన్‌స్కీ కోసం రెడ్ కార్పెట్ కానీ, సైనిక వందనం కానీ ఏర్పాటు చేయలేదు. గతంలో టీషర్ట్‌తో సమావేశానికి వచ్చారని విమర్శలు రావడంతో, ఈసారి ట్రంప్ సూచన మేరకు జెలెన్‌స్కీ ఫార్మల్ సూట్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్, జెలెన్‌స్కీ దుస్తులను మెచ్చుకున్నారు. “ఇరుపక్షాలూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాయి, కానీ ఇది అంత సులభం కాదు” అని వ్యాఖ్యానించారు.

ట్రంప్ అసలు లక్ష్యం అదేనా?
ట్రంప్ తీరు చూస్తుంటే ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధాలను తానే ఆపినట్లుగా ఘనత దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్న ఆయన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని నోబెల్ శాంతి బహుమతి పొందాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ప్రతీసారి క్షేత్రస్థాయిలో దాడులు పెరగడం పరిపాటిగా మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు గడిచినా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ దౌత్యం కేవలం ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప, వాస్తవ శాంతి స్థాపనకు దోహదపడటం లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదే రిపోర్టర్.. అదే సూట్.. జెలెన్‌స్కీ అదిరిపోయే కౌంటర్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన కీలక సమావేశంలో ఓ సరదా స‌న్నివేశం చోటుచేసుకుంది. జెలెన్‌స్కీ ధరించిన సూట్‌పై ఒకప్పుడు విమర్శలు గుప్పించిన రిపోర్టరే ఇప్పుడు ప్రశంసించడం, దీనిపై ట్రంప్ చమత్కారంగా స్పందించడం అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది.

వివరాల్లోకి వెళితే.. సోమవారం ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికన్ కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ మాట్లాడుతూ.. “ఈ సూట్‌లో మీరు అద్భుతంగా ఉన్నారు” అని జెలెన్‌స్కీని మెచ్చుకున్నారు. వెంటనే డొనాల్డ్ ట్రంప్ కల్పించుకుని, “నేను కూడా అదే చెప్పాను” అన్నారు. అంతటితో ఆగకుండా, “గతంలో మిమ్మల్ని దుస్తుల విషయంలో విమర్శించింది ఇతనే” అంటూ జెలెన్‌స్కీకి ఆ రిపోర్టర్‌ను గుర్తు చేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

ట్రంప్ మాటలకు జెలెన్‌స్కీ స్పందిస్తూ, “ఆ విషయం నాకు గుర్తుంది” అని బదులిచ్చారు. ఆ తర్వాత రిపోర్టర్ వైపు తిరిగి, “మీరు కూడా అదే సూట్ ధరించారు” అని అనడంతో అక్కడున్న అధికారులు, జర్నలిస్టులు మరోసారి గట్టిగా నవ్వారు.

గత ఫిబ్రవరిలో ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఇదే రిపోర్టర్ గ్లెన్, జెలెన్‌స్కీని ఆయన దుస్తుల గురించి నిలదీశారు. “మీరు ఈ దేశ అత్యున్నత కార్యాలయంలో ఉన్నారు. సూట్ ఎందుకు వేసుకోరు? అసలు మీ దగ్గర సూట్ ఉందా? మీరు ఈ ఆఫీస్ గౌరవాన్ని పాటించడం లేదని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు” అని ప్రశ్నించారు. దానికి జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే వరకు తాను సైనిక దుస్తుల్లోనే ఉంటానని బదులిచ్చారు.

రష్యాతో శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలపై చర్చించేందుకు జెలెన్‌స్కీ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలస్కాలో సమావేశమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన ట్రంప్‌తో భేటీ కావడం గమనార్హం. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చల మధ్య, సూట్‌పై జరిగిన ఈ సంభాషణ కాస్తంత తేలికైన వాతావరణాన్ని నింపింది.

Related posts

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!

Ram Narayana

గాజాను ఆక్రమించొద్దు.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్

Ram Narayana

హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ హ‌తం.. ధ్రువీక‌రించిన‌ ఇజ్రాయెల్‌!

Ram Narayana