తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్… కేసీఆర్ సంచలన నిర్ణయం..!

  • కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్
  • కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని పేర్కొన్న బీఆర్ఎస్
  • తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడి

బీఆర్ యస్ నుంచి కవిత గెంటివేత …ఆనందంలో బీఆర్ యస్ కార్యకర్తలు
రాష్ట్ర బీఆర్ యస్ కార్యాలయంలో శృతిమించిన సంబురాలు …కార్యాలయానికి అంటుకున్న మంటలు
జాగృతి కార్యకర్తల గరం ..గరం

బీఆర్ యస్ పార్టీ నుంచి కేసీఆర్ కూతురు ,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గెంటివేశారు …గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకారణ విడుదల అయింది …దీంతో బీఆర్ లో జరుగుతున్న పరిణామాలపై మిగతా రాజకీయపార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి.. అసలు కవిత గెంటి వేటకు కారణాలు ఏమిటి …? అనేదానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. పార్టీలో ఆమె జరిగిన అన్యాయం ఏమిటి …? అలాంటిది లేకుండానే ఆమె బీఆర్ యస్ నాయకులపై ప్రత్యేకించి అన్న కేటీఆర్ పై , భావ హరీష్ రావు , కజిన్ సంతోష్ పై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు …ఆస్తితగాదాలే కారణమా ..?అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి..

పార్టీలో జరిగిన ఈ పరిణామం పట్ల బీఆర్ యస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి..కవిత సస్పెన్షన్ ప్రకటన విడుదలైన వెంటనే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీఆర్ యస్ భవనంలో కార్యకర్తలు జరిపిన సభ్యురాలు శృతి మించి కార్యాలయానికి నిప్పు అంటుకున్నది …ఆ మంటలను ఆపేందుకు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి…ఇది ఇలా ఉండగా జాగృతి కార్యకర్తలు పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు …

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.

“పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది.

భగ్గుమన్న ‘జాగృతి’

Kavitha Suspended From BRS Party Jagruthi Activists Protest
  • జూబ్లీహిల్స్ జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు
  • కవిత ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామన్న జాగృతి నేతలు

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్సెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే, ఆమె మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

జూబ్లీహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ‘జై కవితక్క.. జై జాగృతి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ, కవితను పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. తన తండ్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణను ఆమె తట్టుకోలేకపోయారని తెలిపారు. చాలా రోజులుగా కవితను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసమే కవిత పోరాడుతున్నారని, బడుగు బలహీన వర్గాలు ఆమె వెంటే ఉంటాయని స్పష్టం చేశారు. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు.

మరోవైపు, ఈ తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయం నేపథ్యంలో, తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్… టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే?

Mahesh Kumar Goud on Kavithas Suspension from BRS
  • కవితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఆమె సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్య
  • అవినీతి సొమ్ము పంపకాలలో తేడాతోనే కవిత వ్యాఖ్యలు చేశారన్న టీపీసీసీ చీఫ్
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిని ఆమె బయటపెట్టాలని డిమాండ్

ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆమె అవసరం తమ పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానితో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని కవిత పూర్తిగా బహిర్గతం చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలోని కీలక నేతలు హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత బహిరంగంగా విరుచుకుపడిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు మేఘా కృష్ణారెడ్డిపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రతిష్ఠకు వీరే మచ్చ తెచ్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, వారి వల్లే ఇప్పుడు కేసీఆర్ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు ఈ విషయంలో ప్రధాన పాత్ర లేదా?” అని కవిత సూటిగా ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంది.

బీఆర్ఎస్‌ను నాశనం చేసింది.. కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Kavitha Kalvakuntla MLA Anirudh Reddy Opposes Joining Congress

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న వేళ, సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాక పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, “కవిత తన సొంత పార్టీ బీఆర్ఎస్‌ను నాశనం చేశారు. అలాంటి వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, ఇక్కడ కూడా అదే పరిస్థితిని సృష్టిస్తారు. ఆమెను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్‌ను కూడా నాశనం చేయడం ఖాయం” అని తీవ్రంగా విమర్శించారు. కవిత వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు.

కవిత సస్పెన్షన్‌పై స్పందించిన శ్రీధర్ బాబు

కవిత సస్పెన్షన్ అంశం బీఆర్ఎస్, వారి కుటుంబ అంతర్గత వ్యవహారమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ కోసం సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు.

 కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

K Kavitha Congress Conspiracy BRS MLA Palla Rajeshwar Reddy

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని విడదీసి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

కవిత సస్పెన్షన్ అనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్న నిర్ణయమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందువల్లే ఈ చర్యలు తప్పలేదని వివరించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. కానీ తమకు కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయం: హన్మంత్ షిండే

పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. పార్టీ సీనియర్ నేతలపై వ్యాఖ్యలు చేసిన కవితను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత!.. సర్వత్ర ఉత్కంఠ

Kavitha Plans Big Announcement After Suspension

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీతో అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ అనంతరం తన ముఖ్య అనుచరులతో విస్తృతంగా చర్చలు జరిపిన కవిత, ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇంతటితో ఆగకుండా, త్వరలోనే సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే యోచనలో కవిత ఉన్నట్లు ఆమె అనుచరులు బలంగా చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఆమె రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కవిత ఎలాంటి ప్రకటన చేయనున్నారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత ఫ్లెక్సీల తొలగింపు.. హుస్నాబాద్‌లో దిష్టిబొమ్మ దగ్ధం

Kavitha Flexi Removal at BRS Offices Protest in Husnabad

ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆమె పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా కార్యాలయాల లోపల, వెలుపల ఉన్న ఫ్లెక్సీలను, కటౌట్‌లను, బ్యానర్లను పార్టీ శ్రేణులు తొలగిస్తున్నాయి.

మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నిరసన తెలిపింది. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హరీశ్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయారని, ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఏం చెబితే అది చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పార్టీలోని నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కవిత ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసులకు భయపడి కవిత బీజేపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు.

Related posts

ఖమ్మం కాంగ్రెస్ లో కిరికిరి ….ఆరు సీట్లు కావాలని పొంగులేటి పట్టు …

Ram Narayana

చాలా సంతోషంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డిపై జానారెడ్డి ప్రశంసల వర్షం

Ram Narayana

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న

Ram Narayana