స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ పూల సంబురం
-చప్పట్లతో,కోలాట నృత్యాలతో ఆడి పాడిన విద్యార్థులు.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మలతో చిన్నారుల సందడి


పూలను దేవతగా భావించి పూజలు అందించే బతుకమ్మ పండుగ సంబరాలు స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం చిన్నారుల ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు.
పాఠశాల చిన్నారులంతా సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ వేడుకలలో హుషారుగా పాల్గొన్నారు. బతుకమ్మలను పలురకాల పూలతో అందంగా పేర్చి తమ తమ ఇళ్ల నుంచి ప్రత్యేక వస్త్రధారణలతో పాఠశాలకు చేరుకొని బతుకమ్మలను ఉంచి వలయాకారంగా చప్పట్ల తాళాలతో, బతుకమ్మ గేయాలతో ఉత్సాహంగా పూల సంబురాలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పరిమితమైన ఈ సంబురాలను పాఠశాలలో అంబరాన్ని అంటేలా నిర్వహించారు. కోలాటం నృత్యాలతో పాఠశాలలో హోరెత్తించారు. ఔషధ గుణాలు కలిగిన పూలను అందంగా, నేర్పుగా బతుకమ్మలను పేర్చడంతో పాఠశాల చిన్నారులు ఆనందోత్సవాలతో వేడుకలలో మురిసిపోయారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అనాది కాలంగా తెలంగాణ గౌరవ ప్రతిష్టలను బతుకమ్మ సంబురాలు ఇనుమడింప చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆడపడుచుల, చెరువుల పండగగా బతకమ్మ వేడుకలను ప్రకృతి రమణీయతతో ఈ ఉత్సవాలను ఇంటింటా నిర్వహించుకునే పూల సంబురం తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటి చెబుతున్నదని తెలిపారు. ఔషధ గుణాలున్న పూలతో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులపాటు పలు రకాల ఫలహారాలతో ఒకరికొకరు ఆత్మీయంగా,సమైక్యంగా ఉంటూ తమ ఆనందాలను పంచుకునే ప్రత్యేక సంబరాలు బతుకమ్మ వేడుకలలో అందరినీ ఉత్సాహంగా ఉంచుతున్నాయన్నారు. తమ పాఠశాలలో తెలంగాణ ప్రత్యేక సంబురం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ద్వారా మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పాఠశాల విద్యార్థులకు తెలియజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


మాంట్ ఫోర్ట్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు: తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల సందడి.


తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గుట్టల బజార్ మాంట్ ఫోర్ట్ హై స్కూల్లో ఉత్సాహంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు . పాఠశాల ఆవరణమంతా పూలతో అలకరించబడగా , పేరెంట్స్ , ఉపాధ్యాయునిలు , విద్యార్థినులు రంగురంగుల దుస్తుల్లో, విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలు కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను తయారుచేసి వాటి చుట్టూ తిరుగుతూ.. బతుకమ్మ పాటలు పాడారు . పాఠశాల ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది . ఈ వేడుకలో తల్లిదండ్రులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఇది విద్యార్థులకు తమ సంస్కృతి , సంప్రదాయాలను పెద్దల నుంచి నేర్చుకోవడానికి మంచి అవకాశం కల్పించింది . ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ జాన్ పాల్ మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు , ఇది ప్రకృతిని , జీవితాన్ని పూజించే పండుగ . మన సంస్కృతిని , వారసత్వాన్ని భావితరాలకు అందించడం చాలా అవసరం . విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇలా కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ఈ వేడుకలు విద్యార్థులలో వారి కుటుంబాలలో సాంస్కృతిక స్ఫూర్తిని , ఐకమత్యాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం ముగింపులో, సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు . ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జోష్ , బ్రదర్ థామస్ , ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ ఖమ్మం …
శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. ఆటపాటలతో పాఠశాల కోలాహలంగా మారాయి.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, నేటి తరం యువతకు బతుకమ్మ గురించి తెలుపవలిసిన అవసరం మనందరిపైన ఉన్నదని తెలిపారు. దసరా, బతుకమ్మల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయక బట్టలు ధరించి, వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు.
కార్యక్రమంలో
స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.