అంతర్జాతీయం

నోబుల్ బహుమతి వద్దే వద్దు ..తనకు ఇవ్వకపోతే అమెరికాకే నష్టం ..ట్రంప్ రెండు నాల్కలు

ట్రంప్ రెండు నాల్కలు …ఒక పక్క నోబుల్ బహుమతి వద్దు అంటేనే మరోపక్క తనకు నోబుల్ బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాకు జరిగే పెద్ద నష్టమంటూ వ్యాఖ్యానించడం విచిత్రంగాను ,విడ్డురంగా ఉందనే విమర్శలు ఉన్నాయి…ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పాలనపై ప్రజలు విసుగెత్తారని తన పూటకొక్క నిర్ణయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి…అసలు ఆయనకు ఎవరు నోబుల్ బహుమతి ఇస్తామన్నారో తెలియదు కానీ తనకు నోబుల్ బహుమతి వద్దని ,లేదు తాను అనేక యుద్దాలు ఆపిన శాంతిదూతనని అందువల్ల తనకు నోబుల్ బహుమతి ఇవ్వాలని అంటున్నారు …

  • గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యమన్న డోనాల్డ్ ట్రంప్
  • శాంతి ఫార్మలాపై హమాస్ స్పందనకు మూడు నాలుగు రోజులు గడువు ఇచ్చామన్న ట్రంప్
  • ఒప్పందాన్ని అంగీకరించకుంటే ముగింపు విషాదంగా ఉందని ట్రంప్ హెచ్చరిక
  • నోబెల్ బహుమతి వద్దంటున్న ట్రంప్…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కొన్ని కీలక ప్రకటనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. గాజా వివాదానికి శాశ్వత శాంతిని చేకూర్చడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, నోబెల్ శాంతి బహుమతిని తాను ఆశించడం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.

గాజాలో యుద్ధం ముగింపునకు తాము ప్రతిపాదించిన శాంతి సూత్రాలపై హమాస్ స్పందించడానికి మూడు, నాలుగు రోజుల గడువు ఇస్తున్నామని ట్రంప్ అన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే ముగింపు విషాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలు తెలిపారు.

తమ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాలన్నీ స్పందించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో సహా అరబ్ దేశాలు అంగీకరించాయని, ముస్లిం దేశాలు కూడా సానుకూలంగా స్పందించాయని ఆయన వెల్లడించారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, వారు అంగీకరిస్తారో లేదో తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ అంగీకరించకపోతే పరిస్థితులు విషాదకరంగా ఉంటాయని, ఇజ్రాయెల్ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇప్పటికే 25 వేల మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని, వారి నాయకత్వాన్ని మూడుసార్లు నిర్మూలించామని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు వారు శాంతిని కోరుకుంటే మంచిదని, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆయన హెచ్చరించారు.

అదే సమయంలో, మాస్కో బెదిరింపులపై కూడా ట్రంప్ స్పందించారు. రష్యా వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా తీరంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించినట్లు ఆయన తెలిపారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే, తమ వద్ద ఇతర దేశాల కంటే అధికంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. 

నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుంటే అది అమెరికాకే తీవ్ర అవమానం.. తేల్చేసిన ట్రంప్

Donald Trump claims he resolved 7 conflicts deserves Nobel
  • ఇప్పటికే ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానన్న డొనాల్డ్ ట్రంప్
  • గాజా వివాదం కూడా దాదాపు పరిష్కారమైనట్టేనని వెల్లడి
  • ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఒప్పందానికి అంగీకరించాయని వ్యాఖ్య
  • ఏమీ చేయని వారికే నోబెల్ బహుమతి ఇస్తారంటూ కమిటీపై విమర్శలు
  • ఒప్పందాల గురించి తన కంటే ఎవరికీ బాగా తెలియదన్న ట్రంప్  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోతే అది అమెరికాకు జరిగిన పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా గాజా వివాద పరిష్కార ప్రణాళిక గురించి ట్రంప్ ప్రస్తావించారు. “మేం ఆ సమస్యను పరిష్కరించాం, అది దాదాపు సెటిల్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో” అన్నారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్‌తో పాటు అన్ని అరబ్, ముస్లిం దేశాలు అంగీకరించాయని, కేవలం హమాస్ మాత్రమే అంగీకరించాల్సి ఉందని వివరించారు. ఒకవేళ హమాస్ ఒప్పుకోకపోతే వారికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. “ఇది ఒక అద్భుతమైన విషయం. అన్నీ వాటంతట అవే కుదిరాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

గాజా ప్రణాళిక కూడా విజయవంతమైతే, తాను కొన్ని నెలల వ్యవధిలోనే మొత్తం ఎనిమిది అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించినట్టు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఇలా చేయలేదని అన్నారు. అయినప్పటికీ తనకు నోబెల్ బహుమతి వస్తుందా అంటే ‘అస్సలు రాదు’ అని ఆయనే బదులిచ్చారు. “ఏమీ చేయని వాళ్లకే ఆ అవార్డు ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ మనసు గురించి, యుద్ధాన్ని పరిష్కరించడానికి ఏం చేశాడనే దాని గురించి పుస్తకం రాసిన రచయితకు నోబెల్ బహుమతి వెళ్తుంది” అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు.

అయితే, ఏం జరుగుతుందో వేచి చూస్తానని అన్నారు. “నిజం చెప్పాలంటే నాకు వ్యక్తిగతంగా ఆ బహుమతి అక్కర్లేదు. అది మన దేశానికి రావాలి. ఎందుకంటే మనం సాధించింది అసాధారణమైనది. ఒప్పందాల గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. నా జీవితమంతా వాటిపైనే ఆధారపడి ఉంది. గాజాతో కలుపుకుని ఎనిమిది ఒప్పందాలు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను” అని ట్రంప్ వివరించారు.

Related posts

భూమ్మీద పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 60 శాతం ఆ 12 దేశాల నుంచే.. తాజా రిపోర్టులో వెల్లడి

Ram Narayana

ఆరేళ్ల తర్వాత చైనాకు ఎయిరిండియా… ఢిల్లీ నుంచి షాంఘైకి నాన్‌స్టాప్ విమానాలు!

Ram Narayana

15 గంటల పాటు సుదీర్ఘ ప్రెస్ మీట్ … రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు

Ram Narayana