జాతీయ వార్తలు

ట్రాఫిక్ అధికారి చేసిన పొరపాటు.. హెల్మెట్ ధరించనందుకు రూ. 20 లక్షల చలానా!

  • యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో ఘటన
  • సబ్ ఇన్‌స్పెక్టర్ పొరపాటు కారణంగా రూ. 20 లక్షల జరిమానా
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రూ. 4 వేలకు సరిదిద్దిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో లక్ష రూపాయల విలువ చేసే స్కూటర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ. 20.74 లక్షల ట్రాఫిక్ జరిమానా విధించడం వివాదాస్పదమైంది. ఇది వాహనం ధర కంటే 20 రెట్లు అధికం. ముజఫర్‌నగర్ జిల్లాలో హెల్మెట్ ధరించనందుకు ఓ స్కూటర్ రైడర్‌కు ఈ భారీ జరిమానా విధించారు.

ఈ చలాన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి రూ. 20,74,000 జరిమానా విధించగా, పోలీసులు దానిని నిబంధనల మేరకు రూ. 4,000కు తగ్గించారు.

గత మంగళవారం న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్కూటీపై వెళుతున్న అన్మోల్ సింఘాల్ హెల్మెట్ ధరించకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు కూడా చూపించలేకపోయాడు.

దీంతో పోలీసులు అతని స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని రూ. 20.74 లక్షల చలాన్ విధించారు. భారీ జరిమానా చూసి ఆశ్చర్యపోయిన బాధితుడు ఆ చలాన్ ఫోటోను సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడు.

ఈ ఘటనపై ముజఫర్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ (ట్రాఫిక్) అతుల్ చౌబే స్పందించారు. చలాన్ జారీ చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ పొరపాటు కారణంగా ఇలా జరిగిందని తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 ప్రకారం కేసు నమోదు చేశామని, సబ్‌ఇన్‌స్పెక్టర్ 207 తర్వాత ఎంవీ చట్టం అని పొరపాటున రాయలేదని, దానివల్ల రూ. 4,000 జరిమానా కాస్తా రూ. 20,74,000గా నమోదైందని వివరించారు. వాహనదారుడు రూ. 4,000 జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సోనియాగాంధీ…

Ram Narayana

పురాతన ఆలయంలో తవ్వకాలు… మట్టికుండలో బంగారు నాణేలు..

Ram Narayana

2027 జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్… అదే సమయంలో కులగణన కూడా!

Ram Narayana