- ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలన విషయాలు
- 26/11 తరహాలో భారీ దాడులకు ఉగ్రవాదుల కుట్ర
- 200 శక్తిమంతమైన ఐఈడీ బాంబులు సిద్ధం చేసేందుకు ప్లాన్
- కుట్ర వెనుక పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ హస్తం
- ఇప్పటికే 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
- కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్‌లోనూ విధ్వంసం సృష్టించాలని పథకం రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడుల కోసం పనిచేస్తున్న ‘వైద్యుల టెర్రర్ మాడ్యూల్’ గుట్టును అధికారులు రట్టు చేస్తున్నారు. ఇటీవలే జమ్మూకశ్మీర్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేంద్ర ఏజెన్సీలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఈ కుట్ర తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన 40 ఫోరెన్సిక్ నమూనాల్లో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పురోగతిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో ఉన్నతస్థాయి సమావేశం కానున్నారు.
ఈ ఉగ్ర ముఠా సభ్యులు టర్కీలో జైషే హ్యాండ్లర్లతో సమావేశమై కుట్రకు తుదిరూపు ఇచ్చినట్లు కూడా దర్యాప్తులో తేలింది. వాస్తవానికి దీపావళి పండుగ సమయంలోనే జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, అది విఫలమైంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందగా, అనేకమంది గాయపడ్డారు.
ఢిల్లీ పేలుడు.. 10 రోజుల ముందు కారు కొనుగోలు చేసి, అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన డాక్టర్ ఉమర్ నబీ
- అక్టోబర్ 29న కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాన్ని తీసుకున్న ఉమర్ నబీ
- సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండటంతో ఆందోళనకు గురైన ఉమర్ నబీ
- నవంబర్ 10న కారును తీసుకుని ఢిల్లీ వైపు వెళ్లిన ఉమర్ నబీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ పేలుడుకు పది రోజుల ముందు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అక్టోబర్ 29న కారును కొనుగోలు చేసిన వెంటనే కాలుష్య నియంత్రణ ధృవపత్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఉమర్ నబీ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోగా, కారు ఎక్కడ ఉందో కచ్చితంగా తెలియడం లేదు. ఈ కారు పేలుడుకు ముందు పది రోజులుగా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం అక్కడ లేదని చెబుతున్నారు.
సహచరులను అదుపులోకి తీసుకుంటుండటంతో…
కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం తీసుకునే సమయంలో ముగ్గురు వ్యక్తులు కారు నుంచి బయటకు వచ్చారు. వారు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, గత కొన్ని రోజులుగా పోలీసులు తన సహచరులను వరుసగా అదుపులోకి తీసుకుంటుండటంతో ఆందోళనకు గురైన ఉమర్ నబీ నవంబర్ 10న కారును తీసుకుని ఢిల్లీ వైపు వెళ్లినట్లు దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
ఉమర్ నబీ కారును కొనుగోలు చేసినప్పటికీ యజమానిగా సల్మాన్ పేరు ఉంది. దీంతో పోలీసులు గురుగ్రామ్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నారు. 2014 మార్చి 18న సల్మాన్ పేరిట ఈ కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత కారును దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మేశాడు. ఆ తర్వాత సోనూ అనే వ్యక్తి చేతికి చేరిన కారు, అనంతరం పుల్వామాకు చెందిన తారిఖ్ వద్దకు చేరింది. ఈ వాహనం పలుమార్లు చేతులు మారినప్పటికీ యాజమాన్య బదిలీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు. దీంతో నకిలీ పత్రాలతో కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు కేసు: ఉమర్ నబీ పేరు మీద మరో కారు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఎర్రకోట సమీపంలో పేలిపోయిన ఐ20 కారు
- నిందితుడి పేరుపై మరో కారు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
- ఫరీదాబాద్ జిల్లాలో ఖాండవాలీ గ్రామంలో ఎరుపు రంగు కారు స్వాధీనం
ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో పేలిపోయిన ఐ20 కారును నడిపిన నిందితుడి పేరు మీద మరో కారు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అది ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు అని గుర్తించారు. ఈ కారు కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, హర్యానా రాష్ట్రంలోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు.
ఐ20 కారును నిందితుడు ఉమర్ నబీ నడిపినట్లు గుర్తించారు. అతని పేరు మీదే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించి, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచనలు జారీ చేశారు.
ఉమర్ నబీ పేరు మీద ఉన్న ఈ కారును గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కారు గురించిన సమాచారం ఎక్కడైనా తెలిస్తే వెంటనే తెలియజేయాలని కారు నెంబర్, ఇతర వివరాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకి ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పేలుడు వెనుక ఆరుగురు డాక్టర్లు.. ఈ ఘటనలోనూ హైదరాబాదీ లింకు!

- ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు
- వెలుగులోకి వచ్చిన వైట్-కాలర్ ఉగ్రవాద ముఠా
- నిందితుల్లో ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు మత గురువులు
- వివిధ రాష్ట్రాల్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
- కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)
- గణతంత్ర దినోత్సవం నాడే దాడికి మొదట ప్లాన్
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన అత్యంత తీవ్రత కలిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడి వెనుక డాక్టర్లు, మత గురువులు, ఇతర నిపుణులతో కూడిన ఒక ‘వైట్-కాలర్ ఉగ్రవాద ముఠా’ ఉన్నట్లు దర్యాప్తులో తేలడం సంచలనంగా మారింది.
జైష్-ఇ-మొహమ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ పేలుడు వెనుక ఉన్న డాక్టర్లలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కావడం గమనార్హం. గతంలోనూ అనేక ఉగ్రదాడులకు హైదరాబాదీ లింకులు బట్టబయలయ్యాయి.
జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు కేంద్ర ఏజెన్సీలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ కేసులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన వైద్యులు కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో 2,900 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును చేపట్టింది.
ఈ ముఠా సభ్యులు ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్ల ద్వారా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరిపినట్లు, పేలుడు పదార్థాలను రహస్యంగా రవాణా చేసినట్లు తేలింది. అల్-ఫలాహ్ యూనివర్శిటీలో 52 మంది విద్యార్థులు, సిబ్బందిని ప్రశ్నించిన తర్వాత కీలక సమాచారం లభించింది. ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నిందితుల ఫోన్లలో లభించిన నంబర్ల ద్వారా అధికారులు అనుమానిస్తున్నారు.
పేలుడు ఘటన వివరాలు
ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) నివేదికలో వెల్లడైంది. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తి ఐ20 కారును నడుపుతూ ఈ దాడికి పాల్పడినట్లు, పేలుడు సమయంలో అతను కారులోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ కేసులోని ఆరుగురు డాక్టర్ల వివరాలు
1. డాక్టర్ ముజమ్మిల్ గనై (35, పుల్వామా): ఈ కేసులో కీలక నిందితుడు. అల్-ఫలాహ్ యూనివర్శిటీలో డాక్టర్‌గా, ఎంబీబీఎస్ విద్యార్థులకు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇతని అద్దె ఇంటి నుంచి 358 కిలోల అమ్మోనియం నైట్రేట్, క్రింకోవ్ అసాల్ట్ రైఫిల్, 91 తూటాలు, పిస్టల్, రిమోట్ కంట్రోల్స్ స్వాధీనం చేసుకున్నారు. జనవరి 26నే దాడి చేయాలని ప్లాన్ చేసి, రెక్కీ కూడా నిర్వహించాడు.
2. డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ (కుల్గాం): ముజమ్మిల్, ఉమర్‌లకు అత్యంత సన్నిహితుడు. ఇతడిని ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో అరెస్టు చేశారు. శ్రీనగర్ జీఎంసీలోని తన లాకర్ నుంచి ఏకే-47 రైఫిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో, దాచిపెట్టడంలో ఇతనిది కీలక పాత్ర.
3. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ (పుల్వామా): పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారును నడిపింది ఇతనే. దాడిని ప్రత్యక్షంగా అమలు చేశాడు. ముజమ్మిల్, అదీల్‌తో కలిసి లాజిస్టిక్స్ సమన్వయం చేశాడు.
4. డాక్టర్ షాహీన్ సయీద్ (లక్నో): ముజమ్మిల్‌కు సన్నిహితురాలు. ఫరీదాబాద్‌లోని కారు నుంచి అసాల్ట్ రైఫిల్‌ను శ్రీనగర్‌కు తరలించింది. కమ్యూనికేషన్, రసాయనాల సేకరణలో పాలుపంచుకుంది.
5. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (హైదరాబాద్): చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. రాజేంద్రనగర్‌లో షవర్మా వ్యాపారం చేస్తున్నాడు. ఇతడిని గుజరాత్ ఏటీఎస్ నవంబర్ 8న అరెస్టు చేసింది. టెలిగ్రామ్ ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా, 4 కిలోల రిసిన్ విషం తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
6. డాక్టర్ సజాద్ మాలిక్ (పుల్వామా): ఉమర్‌కు స్నేహితుడు. ఈ కేసులో ఇతడి పాత్రపై ఆరా తీసేందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇతర నిందితులు
షోపియాన్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ యువ డాక్టర్లను ఉగ్రవాదం వైపు మళ్లించగా, మేవాత్‌కు చెందిన మౌల్వీ హఫీజ్ మహ్మద్ ఇష్టియాక్ తన ఇంటిలో 2,500 కిలోల పేలుడు పదార్థాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని, విద్యా సంస్థలను రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా మార్చుకుని ఈ ముఠా దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.