- దేశంలో 1.3 శాతం వరకు నిరుద్యోగం తగ్గే అవకాశం ఉందన్న నివేదిక
- వినియోగం రూ.75,000 కోట్ల మేర పెరిగే సూచనలు
- సంఘటిత రంగ కార్మికుల వాటా 75.5 శాతానికి పెరుగుతుందని అంచనా
దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన కార్మిక చట్టాలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ చట్టాల అమలుతో నిరుద్యోగం 1.3 శాతం వరకు తగ్గి, దాదాపు 77 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది.
ఈ ఉపాధి కల్పనతో పాటు వినియోగం కూడా భారీగా పెరగనుందని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. “ఒక్కో వ్యక్తి రోజువారీ వినియోగం రూ.66 పెరిగి, దేశవ్యాప్తంగా వినియోగ వ్యయం సుమారు రూ.75,000 కోట్లకు చేరుకుంటుంది. ఇది వినియోగానికి పెద్ద ఊపునిస్తుంది” అని ఆయన వివరించారు.
ప్రస్తుతం దేశంలో 44 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తుండగా, వీరిలో 31 కోట్ల మంది ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యారు. కొత్త చట్టాల వల్ల వీరిలో కనీసం 20 శాతం మంది, అంటే దాదాపు 10 కోట్ల మంది సంఘటిత రంగంలోకి మారతారని నివేదిక అంచనా వేసింది. దీంతో దేశంలో సంఘటిత రంగ కార్మికుల వాటా 60.4 శాతం నుంచి 75.5 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 ఏళ్లలో సామాజిక భద్రత పరిధి 80-85 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం 2019, 2020 సంవత్సరాల్లో పార్లమెంటులో ఆమోదించిన నాలుగు కార్మిక కోడ్‌లను ఈ నెల 21 నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణలు కార్మికులు, యాజమాన్యాలు ఇద్దరికీ సాధికారత కల్పిస్తాయని, తద్వారా దేశం మరింత పోటీతత్వంతో స్వావలంబన దిశగా పయనిస్తుందని నివేదిక అభిప్రాయపడింది.
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికవర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతుండగా అందుకు భిన్నంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అదేం లేదు కొత్త చట్టాల వల్ల 77 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పడం విడ్డురంగా ఉంది ..పైగా ఉద్యోగాల కల్పన వలన ఆర్థిక వ్యవస్థకి బూస్టింగ్ లభిస్తుందని పేర్కొన్నది …పాలకులు చెప్పే మాటలనే ఎస్ బి ఐ వల్ల వేస్తుందనే విమర్శలు ఉన్నాయి.. అసలు స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరపకుండా వారు చెపుతున్న అభ్యంతరాలను పరిశీలించకుండా ఇక పక్షంగా నిర్ణయించడం ఇది కార్మికులకు అన్యాయం చేయడమేనని దీనిపై పోరాటాలు తప్పవని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి..పైగా బ్యాంకింగ్ రంగంలో మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో టాప్ 10 లో ఉండాలని అనేక బ్యాంకులను ప్రవేట్ పరం చేయడం దుర్మార్గమని ఇది ముమ్మాటికీ కార్మిక వ్యతిరేక చర్యేనని బ్యాంకు ఎంప్లాయిస్ సంఘాలు మండిపడుతున్నాయి..కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఒక్క కలంపోటుతో డస్ట్ బిన్ లో వేయడం కార్మికవర్గం పట్ల పాలకుల వైఖరిని తెలియజేస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ చట్టాలు యాజమాన్యాలకు అనుకూలంగా ,కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని మంగళవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులూ తెలిపారు .. తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ..