నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

- నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
- ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
- షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ
- బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
నిన్న నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా క్యాజిల్ ఫర్నిచర్ మాల్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అగ్నిమాపక భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు 20 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో మూడు మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించిన రెస్క్యూ బృందాలు, ముగ్గురి మృతదేహాలను గుర్తించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
సెల్లార్ మొత్తం ఫర్నీచర్‌తో నిండి ఉండటం, దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అక్రమ కట్టడాలపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో అక్రమ కట్టడాల వల్లే ఇలాంటి ఘోర ప్రమాదాలు పదేపదే జరుగుతున్నాయని మండిపడింది. అధికారులు నిర్లక్ష్యం వీడి కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.