తెలంగాణ వార్తలు

చిలుకూరి బాలాజీ అర్చకుడిపై కేసు …

చిలుకూరు అర్చకుడితో పాటు నలుగురిపై కేసు: ధర్మరక్ష సభలో విద్వేష ప్రసంగాలే కారణం!

Chilkur Temple Priest and Four Others Booked Over Hate Speech
  • విద్వేష ప్రసంగాల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు
  • చిలుకూరు రంగరాజన్‌తో పాటు నలుగురిపై కేసు
  • ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలే కారణం
  • న్యాయవాది ఫిర్యాదుతో రంగారెడ్డి పోలీసుల చర్య

భాగ్యనగరంలో ఇటీవల జరిగిన ‘ధర్మరక్ష సభ’ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బాలాపూర్ వేదికగా నిర్వహించిన ఈ సభలో ముస్లింలను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి.ఎస్. రంగరాజన్‌తో పాటు మరో నలుగురు ప్రముఖులపై రంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. షా అలీ బండకు చెందిన న్యాయవాది రెహ్మాన్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో జనవరి 28న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. చిలుకూరు అర్చకుడు రంగరాజన్, ఎంఆర్పీఎస్ నేత రవికుమార్, న్యాయవాది కరుణాసాగర్ కాశింశెట్టి, గిరిధర్ స్వామి శాస్త్రి మరికొందరు సభ్యులు కలిసి మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారని అభియోగాలు మోపారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 196(1), 223, 3(5) కింద కేసులను నమోదు చేశారు. ముస్లింలు, రోహింగ్యాలను ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తూ, వారిపై హింసను ప్రేరేపించేలా మాట్లాడి హైకోర్టు ఆదేశాలను వీరు ధిక్కరించారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ సభలో ప్రధాన వక్తగా ఉన్న గిరిధర్ స్వామి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. భారతదేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చే వరకు తాను నిద్రపోనని ఆయన ప్రకటించారు. శాంతి స్థాపనపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, హిందూ మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని, వారికి చిన్నతనం నుంచే ఆత్మరక్షణ కోసం కత్తులు, తుపాకులు వాడటం నేర్పించాలని పిలుపునిచ్చారు. సెక్యులరిజం అనే భావనను తప్పుబడుతూ, హిందూ సమాజం సంఘటితమై దాడులకు ప్రతిదాడి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు చిలుకూరు రంగరాజన్ భారత రాజ్యాంగంలో శ్రీరాముడిని చేర్చాలని ప్రతిపాదించగా, కరుణాసాగర్ రోహింగ్యాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ చొరబాటుదారులని, వారిని తక్షణమే గుర్తించి దేశం నుంచి పంపించేయాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్వహించిన ఈ ‘జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్’ ర్యాలీలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి అంశాలపై కూడా వక్తలు తీవ్రంగా స్పందించారు. 

Related posts

వ్యాపారి మోసపు ప్రకటన…చిర్రెత్తిన జనాలు పాతకార్లపై రాళ్లదాడి…

Ram Narayana

ఖమ్మం సీపీగా సునీల్ దత్

Ram Narayana

భద్రాచలం ఆలయంలో విమానం వెళ్తున్నట్టు వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు

Ram Narayana