అంతర్జాతీయం

నిప్పులు చెరుగుతున్న వెనెజువెలా.. మదురో దంపతులను విడిచిపెట్టాలని నిరసనలు…

  • అధ్యక్షుడు మదురో కిడ్నాప్‌పై ఆగ్రహం
  • నెల రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు
  • అమెరికా సైనిక చర్యపై వెనెజువెలా సైన్యం ఫైర్

వెనెజువెలా రాజధాని కరాకస్ నగరం నిరసన జ్వాలలతో అట్టుడుకుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడిలో బందీలుగా చిక్కిన తమ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను వెంటనే విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. జనవరి 3న మొదలైన ఈ నిరసనలు మంగళవారం నాటికి ఉద్ధృత రూపం దాల్చాయి.

ఒక దేశాధ్యక్షుడిని మరో దేశ సైన్యం బలవంతంగా ఎత్తుకుపోవడాన్ని వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ తీవ్రంగా ఖండించారు. “ప్రపంచంలోని అతిపెద్ద అణుశక్తి దేశం, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మాపై దాడికి తెగబడింది. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం” అని ఆయన ధ్వజమెత్తారు. వెనెజువెలా సాయుధ దళాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయని, మదురో తిరిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్‌కు ప్రజలు, సైన్యం పూర్తి మద్దతు ప్రకటించారు. మిరాండా రాష్ట్ర గవర్నర్ ఎలియో సెరానో మాట్లాడుతూ.. వెనెజువెలా ప్రజలు ఇంకా వెనకడుగు వేయలేదని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరాకస్‌లోని ప్లాజా వెనెజువెలా నుంచి ఉర్దానెటా అవెన్యూ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో మహిళా పారిశ్రామికవేత్తలు, కార్మికులు భారీగా పాల్గొన్నారు.

అమెరికా మాత్రం మదురో పాలన అప్రజాస్వామికమని, ఆయనపై ఉన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు గతంలోనే ప్రకటించింది. అయితే, ఒక సార్వభౌమ దేశాధ్యక్షుడిని ఇలా బంధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

Related posts

 కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం…

Ram Narayana

పనిలో పనిగా… బంగ్లాదేశ్‌పైనా ఆంక్షలు!

Ram Narayana

అమెరికాపై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్న యూఎస్ ఇంటెలిజెన్స్!

Ram Narayana