అంతర్జాతీయం

బలూచిస్థాన్‌లో మా బలగాలు చేతులెత్తేస్తున్నాయి.. పాక్ రక్షణ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు..

  • బీఎల్ఏ దాడుల్లో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది సహా 80 మంది మృతి 
  • బలూచిస్థాన్ విస్తీర్ణం ముందు తమ సైన్యం బలైందన్న ఖవాజా ఆసిఫ్ 
  • 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన తిరుగుబాటుదారులు 
  • తిరుగుబాటులో పాల్గొంటున్న మహిళా ఫిదాయీలు 

పాకిస్థాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్‌లో వేర్పాటువాద సెంట్రల్ దాడులు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులను అణచివేయడంలో తమ భద్రతా దళాలు ‘శారీరక వైకల్యంతో’ ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

బలూచిస్థాన్ విస్తీర్ణం పాకిస్థాన్ మొత్తం భూభాగంలో 40 శాతానికి పైగా ఉందని, కానీ జనాభా మాత్రం చాలా తక్కువని ఆసిఫ్ పేర్కొన్నారు. “ఒక నగరాన్ని నియంత్రించడం సులభం, కానీ ఇంత పెద్ద రాష్ట్రాన్ని కాపాడటం చాలా కష్టం. మా సైనికులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు, కానీ ఆ ప్రాంత విస్తీర్ణం, పర్వత ప్రాంతాల వల్ల వారు తిరుగుబాటుదారులను సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారు” అని ఆయన ఒప్పుకున్నారు.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య ‘ఆపరేషన్ హెరోఫ్ 2.0’ పేరుతో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 17 మంది భద్రతా సిబ్బంది, 33 మంది సామాన్య పౌరులు మరణించగా, పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 177 మంది తిరుగుబాటుదారులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి దాడుల్లో మహిళా ఫైటర్లు కూడా పాల్గొనడం పాక్ సైన్యాన్ని కలవరపెడుతోంది. నుష్కీలోని ఐఎస్‌ఐ కార్యాలయంపై దాడి చేసింది ఆసిఫా మెంగల్ అనే మహిళా ఫిదాయీ అని గుర్తించారు.

బలూచిస్థాన్‌లో కేవలం స్వేచ్ఛ కోసం పోరాటం జరగడం లేదని, అక్కడ చమురు స్మగ్లింగ్ చేసే మాఫియా, బ్యూరోక్రసీ, వేర్పాటువాదులు కలిశారని ఆసిఫ్ ఆరోపించారు. ఇరాన్ నుంచి జరిగే పెట్రోల్ స్మగ్లింగ్ ద్వారా వీరు రోజుకు సుమారు 4 బిలియన్ పాక్ రూపాయలు ఆర్జిస్తున్నారని, అందుకే వీరు అఫ్ఘనిస్థాన్ మద్దతుతో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, బలూచిస్థాన్ ప్రజలు దశాబ్దాలుగా తమ ఖనిజ సంపదను పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటోందని, తమకు కనీస సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చైనా పెట్టుబడి పెట్టిన గ్వాదర్ పోర్ట్ (CPEC) వల్ల స్థానికులకు ఎలాంటి ఉపయోగం లేదని, అది కేవలం వనరులను తరలించుకుపోవడానికేనని అక్కడి ప్రజల ఆగ్రహం.

ఈ దాడుల నేపథ్యంలో బలొచిస్థాన్ అంతటా నెల రోజుల పాటు సెక్షన్ 144 విధించారు. రైలు సర్వీసులు ఇప్పటికే మూడవ రోజు కూడా నిలిచిపోయాయి.పాకిస్థాన్ ఈ తిరుగుబాటును అణచివేయడానికి మరిన్ని బలగాలను మోహరిస్తోంది. 

Related posts

భారత్‌పై సుంకాల భారం.. అమెరికాకే ఎదురుదెబ్బ!

Ram Narayana

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం…

Ram Narayana

భూటాన్ పర్యటన ముగింపు.. నాలుగో రాజుతో ప్రధాని మోదీ భేటీ

Ram Narayana