ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

“హలో ఇండియా” అంటూ జగన్ మరో ట్వీట్…

Jagan Criticizes Chandrababu Government Over Srisailam Incident
  • శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్‌ చేశారన్న జగన్
  • ఆలయాల నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ
  • తిరుపతి, సింహాచలం ఘటనలను ప్రస్తావించిన వైసీపీ అధినేత
  • ప్రచారానికే తప్ప ప్రభుత్వానికి బాధ్యత లేదని ఆరోపణ
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించిన జగన్

శ్రీశైలంలో శివమాల ధరించిన భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాలకు వెళ్లే భక్తులకు భద్రత కరువైందని, భక్తితో యాత్రలు చేసేవారు నేడు భయంతో ఆలయాలకు వెళ్లాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఘోర వైఫల్యాల వల్లే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు “హలో ఇండియా” అంటూ ట్వీట్ చేశారు.

“శ్రీశైలం ఆలయంలో శివమాల ధరించిన భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి పరాకాష్ఠ. ఏటా మహాశివరాత్రికి పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల భక్తులు భారీగా తరలివస్తారని తెలిసినా, అధికారులు కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో గంటల తరబడి పిల్లాపాపలతో భక్తులు నరకయాతన అనుభవించారు” అని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో, పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీలతో దాడి చేయడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన జరిగిన తర్వాత రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోందని, జవాబుదారీతనం అన్నదే కనిపించడం లేదని ఆరోపించారు.

“2025 జనవరిలో తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటలో ఆరుగురు, ఏప్రిల్‌లో సింహాచలంలో గోడ కూలి ఏడుగురు, నవంబర్‌లో కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మరణించారు. ఈ ఘటనల తర్వాత కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. తిరుమల లడ్డూ వంటి పవిత్రమైన అంశాలను రాజకీయాల్లోకి లాగి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఈ నీచ రాజకీయాలు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకూ వ్యాపిస్తున్నాయి” అని జగన్ విమర్శించారు.

సనాతన ధర్మం గురించి పదేపదే మాట్లాడే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. భక్తులపై లాఠీ దెబ్బలు పడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహించి, భక్తులకు క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

Related posts

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్…

Ram Narayana

వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

Ram Narayana

జగన్ తో భేటీ అయిన మాజీ మంత్రి రోజా!

Ram Narayana