జాతీయ వార్తలు

బీహార్‌ లో నెత్తురోడిన పెళ్లిపందిరి..!

  • స్టేజీపై ఉన్న వధువుపై కాల్పులు.. పొట్టలోకి దూసుకెళ్లిన తూటా
  • ప్రాణాపాయ స్థితిలో పెళ్లికూతురు.. పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయిన వరుడి కుటుంబం
  • పొరుగింటి యువకుడి ఘాతుకం.. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేదికపై ఉన్న వధువును ఒక దుండగుడు తుపాకీతో కాల్చడంతో సంబరాలన్నీ ఒక్కసారిగా రోదనలుగా మారాయి. వివరాల్లోకి వెళితే.. చౌసా నగర్ పంచాయతీ పరిధిలోని మల్లా తోలా గ్రామానికి చెందిన ఆర్తి కుమారికి మంగళవారం రాత్రి వివాహం జరుగుతోంది. వేడుకల్లో భాగంగా ఆర్తి స్టేజ్ పైన వరుడితో కలిసి ఉంది. బంధువులంతా చుట్టూ నిలబడి ఉండగా.. ఆర్తి కుమారి సోదరి తనకు కాబోయే బావకు తిలకం దిద్దుతోంది. సరిగ్గా అదే సమయంలో అతిథుల మధ్యలో ఉన్న దీనబంధు అనే యువకుడు ఆర్తిపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ నేరుగా ఆర్తి పొట్టలోకి దూసుకెళ్లింది.

తుపాకీ శబ్దంతో పెళ్లి పందిరిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రక్తపు మడుగులో పడిపోయిన ఆర్తిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను వారణాసిలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా నుంచి వచ్చిన పెళ్లి బృందం వివాహం జరగకుండానే వెనుదిరిగింది.

ప్రేమ వ్యవహారమే కారణమా..
నిందితుడు దీనబంధు వధువు ఇంటి పొరుగునే ఉంటాడని సమాచారం. వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలో మద్యం కేసుకు సంబంధించి జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా, విచారణ నిమిత్తం అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉంది: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

Ram Narayana

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడి.. ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృతి!

Ram Narayana

‘ఇండియా’ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి: రాజ్యసభలో బీజేపీ ఎంపీ బన్సాల్ వ్యాఖ్యలు

Ram Narayana