ఆంధ్రప్రదేశ్

దేవాలయాలు మన సంస్కృతికి ప్రతీకలు: జగన్

  • నందిపల్లి గ్రామంలోని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జగన్
  • భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వ్యాఖ్య
  • ఆలయ కమిటీని అభినందించిన జగన్

కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణంలో జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన హోమాలు, ప్రత్యేక అభిషేకాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం గావించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… దేవాలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. “భక్తి మార్గం ద్వారానే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల పునర్నిర్మాణం జరగడం వల్ల ఆథ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. నందిపల్లిలో ఈ మహోత్సవాన్ని ఒక పండగలా నిర్వహించడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.

కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, ఇతర సభ్యులను జగన్ ప్రత్యేకంగా అభినందించారు. నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి రాజధాని కేసు జులై 11 వాయిదా…!

Drukpadam

వచ్చే ఉగాది నాటికి జనసేన పార్టీ ఉంటే గుండు గీయించుకుంటా: మంత్రి బొత్స

Ram Narayana

బాసర ట్రిపుల్ ఐటీలో.. ఎగ్‌ఫ్రైడ్ రైస్ తిని 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Drukpadam