- జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ భీకర దాడి
- రూ.2,500 కోట్ల విలువైన ఏఎన్/టీపీవై-2 రాడార్ ధ్వంసం
- శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం ధృవీకరించిన అమెరికా అధికారులు
- థాడ్ సిస్టమ్‌లో కీలకమైన రాడార్ లేకపోవడం రక్షణ వ్యవస్థకు దెబ్బ
- ఇరాన్‌కు ఇది అతిపెద్ద విజయమని నిపుణుల విశ్లేషణ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికాకు చెందిన అత్యంత విలువైన మిసైల్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడైంది. జోర్డాన్‌లోని మువాఫ్ఫక్ సల్టి ఎయిర్ బేస్‌లో ఉన్న ఏఎన్/టీపీవై-2 రాడార్‌ను ఇరాన్ క్షిపణులు పూర్తిగా నాశనం చేశాయని వాణిజ్య శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడింది.
సుమారు 300 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.2,500 కోట్లు) విలువైన ఈ రాడార్, అమెరికా ‘థాడ్’ (THAAD) మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో అత్యంత కీలక భాగం. బాలిస్టిక్ క్షిపణులను ఎత్తులోనే గుర్తించి, వాటిని కూల్చివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఈ దాడి జరిగిందని అమెరికా అధికారులు కూడా ధృవీకరించారు. ఖరీదైన ఈ రాడార్ ధ్వంసం కావడంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, మిత్రదేశాల రక్షణ వలయంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామంపై ఎఫ్‌డీడీ డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రాబ్స్ట్ మాట్లాడుతూ.. “థాడ్ రాడార్‌పై దాడి ఇరాన్‌కు ఇప్పటివరకు లభించిన అతిపెద్ద విజయం” అని అభిప్రాయపడ్డారు. మరోవైపు, సీఎస్ఐఎస్ నిపుణుడు టామ్ కారకో స్పందిస్తూ.. అమెరికా ఆర్మీ వద్ద ఇలాంటి రాడార్లు కేవలం 8 మాత్రమే ఉన్నాయని, స్పేర్ రాడార్లు లేకపోవడంతో ఇది వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అని విశ్లేషించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పెంటాగాన్, వెంటనే ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు రక్షణ రంగ సంస్థలతో చర్చలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఖతార్‌లోని మరో రాడార్ కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తుండటంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.