దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ శనివారం వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, దాడులను ముమ్మరం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
దేశంలో గృహావసరాలకు సరిపడా వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాక్ తగినంతగా ఉన్నప్పటికీ, కొందరు అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేస్తున్నారని, దీనివల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడుతోందని సుజాతా శర్మ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భారత్ వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా సరఫరాకు ఆటంకం కలగదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.