
పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వేళ ఈ బదిలీలు చేపట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు.
సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనాలతో పాటు డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఈసీ బదిలీ చేసింది. దీనిపై మమత ఘాటుగా స్పందించారు. “అర్ధరాత్రి ఒంటి గంటకు నాకు మెసేజ్ వచ్చింది. ఇలాంటి చర్యలు ఎప్పుడైనా చూశారా? చీఫ్ సెక్రటరీ ఒక బెంగాలీ మహిళ. ఆమెను తొలగించారు. వీళ్లు బెంగాలీలకు, మహిళలకు వ్యతిరేకులు” అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
గతంలో అధికారుల బదిలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురి పేర్లతో జాబితాను ఈసీ కోరేదని, కానీ ఈసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మమత ఆరోపించారు. “ఇదేమైనా ఢిల్లీ లడ్డూ అనుకుంటున్నారా? ఇది వాళ్ల జాగీరా?” అని ప్రశ్నించారు. డీజీపీగా ఉన్న పీయూష్ పాండే బెంగాలీ కాదని, ఆయనను కూడా తొలగించారని గుర్తు చేశారు. బీజేపీకి అనుకూలంగా పనిచేసే వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు.
వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “మీరు అన్నీ మార్చండి.. అయినా సరే బెంగాల్‌లో ప్రభుత్వం మారదు. ఇది నా మాట” అని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి శశి పంజా ఇంటిపై దాడి జరిగినట్లే, తన నివాసంపై కూడా దాడి చేసే అవకాశం ఉందని మమత ఆందోళన వ్యక్తం చేశారు. “ధైర్యం ఉంటే వచ్చి దాడి చేయండి. మేం ఎదుర్కొంటాం” అని సవాల్ విసిరారు. అదే సమయంలో, ప్రజలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే చర్యలకు లొంగవద్దని సూచించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), హోం సెక్రటరీలను ఆ పదవుల నుంచి తప్పించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాలను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి సంఘమిత్ర ఘోష్‌ను నియమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించి, నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీ అయిన అధికారులకు ఎలాంటి ఎన్నికల సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలను సమీక్షించిన తర్వాత, నిష్పాక్షికమైన పోలింగ్ నిర్వహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వంలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఎంసీ ఎంపీల బాయ్ కాట్
ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో టీఎంసీ సభ్యులు బాయ్ కాట్ చేశారు …ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని టీఎంసీ సభ్యులు ఈసీ చర్యలను తప్పు పట్టారు ..బీజేపీకి లబ్దిచేకూర్చేందుకే ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీఎంసీ దుయ్యబట్టింది ..