రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారం స్మగ్లింగ్ వంటి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్‌గా ఎలా నియమించుకుంటారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే ‘హౌస్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేసిన హరీశ్ రావు… ప్రభుత్వం చెబుతున్న పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి లక్ష్యం కేవలం 22,750 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు.
ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే తాము చేసే ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
హరీశ్ రావు చేసిన ఈ ఆరోపణలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. ఇవన్నీ కేవలం నిరాధారమైన ఆరోపణలని, ప్రతిపక్ష నేతలు సిఫార్సు చేసిన వారికి పదవులు దక్కలేదనే అక్కసుతోనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు ప్రస్తావించిన ప్రేమ్ చంద్ గార్గ్‌కు ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎటువంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తెలంగాణ, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన అధికారిక ఒప్పందమని స్పష్టం చేశారు.
ఫిలిప్పీన్స్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగానే ఎగుమతుల్లో కొంత జాప్యం జరిగిందని, అయితే అక్కడ అన్ని దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ కేవలం తెలంగాణ బియ్యానికి మాత్రమే మినహాయింపు లభించిందని వివరించారు. కేవలం ఒక షిప్‌మెంట్ మాత్రమే కాకినాడ పోర్టులో నిలిచిపోయిందని, అంతకు మించి అక్రమాలు ఏవీ జరగలేదని మంత్రి సభలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.