ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సాధారణ ఉపాధ్యాయురాలు అసాధారణమైన ఘనతను సాధించారు. గోరఖ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల దివ్యా సింగ్ కేవలం 14 రోజుల్లో సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుని చరిత్ర సృష్టించారు. సాధారణంగా ఈ బేస్ క్యాంప్‌కు సాహస యాత్రికులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా సైకిల్‌పై ఈ ప్రయాణాన్ని పూర్తిచేసి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా దివ్య సరికొత్త రికార్డు నెలకొల్పారు.
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి తన సాహస యాత్రను ప్రారంభించిన దివ్య.. సముద్ర మట్టానికి 5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మైనస్ 12 డిగ్రీల గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు సైకిల్ తొక్కారు. కొన్నిచోట్ల దారి సరిగా లేకపోవడంతో, తన సైకిల్‌ను భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగడం ఆమె సంకల్పానికి నిదర్శనం.
ఈ ఘనతపై దివ్యా సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక సాధారణ ఉపాధ్యాయురాలు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. శారీరక బలం కంటే మానసిక ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది. మహిళలు తలచుకుంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నయినా ఛేదించగలరని నిరూపించడమే నా లక్ష్యం’ అని తెలిపారు. దివ్యా సింగ్ సాధించిన ఈ అద్భుత విజయం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె విజయం దేశంలోని ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.