అంతర్జాతీయం

ట్రంప్హెచ్చరికలు..పట్టించుకోనిఇరాన్

గల్ఫ్ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందిఇరాన్ పై అమెరికా , ఇజ్రాయెల్ జరిపిన దాడి న్యాయబద్ధమైనది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.. అమెరికాలోనే ట్రంప్ చర్యలకు అక్కడ ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు ..ఇక బ్రిటన్ ,ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ భూభాగంలో అమెరికా యుద్ధ విమానాలను అనుమతించబోమని ప్రకటించడంతో చిర్రెత్తిన ట్రంప్ భూతు పురాణం లంకించుకున్నారు ..చివరికి నాటో కూటమి దేశాలను సైతం తిట్టిపోశాడువారం రోజుల్లో ఇరాన్ యుద్ధం ముగిస్తామని ప్రకటించిన ట్రంప్ కు ఇరాన్ చుక్కులు చూపిస్తుండడం తో దిక్కుతోచని పరిస్థిల్లో ఇరాన్ ను అంతం చేస్తానని ఈరోజుతోనే danipani khatam అని ప్రగల్బాలు పలుకు తున్నాడు ..

మా రెడ్ లైన్స్ దాటొద్దు… ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్

Iran Responds to Trumps Warnings with Strong Message

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ ‘రెడ్ లైన్స్’ (హద్దులు) దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని, తమ స్పందన మధ్యప్రాచ్యం దాటి విస్తరిస్తుందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది.

ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులతో పాటు డ్రోన్లతో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని రెండు అమెరికన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లపై, ఇజ్రాయెల్ సైనిక సామగ్రి రవాణా చేస్తున్న ఓడపై కూడా కచ్చితమైన దాడులు చేశామని తెలిపింది. పౌర లక్ష్యాలపై తాము దాడి చేయబోమని, కానీ తమ పౌర సదుపాయాలపై దాడులు జరిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పింది.

మధ్యప్రాచ్యం ప్రాంతంలోని ఆయిల్, గ్యాస్ సౌకర్యాలను సంవత్సరాల తరబడి పనిచేయకుండా నాశనం చేయగలమని కూడా ఇరాన్ బెదిరించింది. అమెరికా మిత్రదేశాల విషయంలో ఇప్పటివరకు తాము సంయమనం పాటించామని, ఇకపై ఆ నియంత్రణలు ఉండవని స్పష్టం చేసింది. 

మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది. అది తిరిగి ఎప్పటికీ పునరుద్ధరించబడదు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది,” అని పేర్కొన్నారు. ఇరాన్‌లో సంపూర్ణ పాలన మార్పు జరగనుందని, వివేకవంతులైన నేతలు అధికారంలోకి వస్తే అద్భుతాలు జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటి. 47 ఏళ్ల ఇరాన్ దోపిడీ, అవినీతి, మరణాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది” అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ.. “పశుబలం ప్రదర్శించే తర్కం ఓడిపోవడం ఖాయం. మా నాగరిక దేశ సంస్కృతి, తర్కం, విశ్వాసాల శక్తి కచ్చితంగా గెలుస్తుంది. మా హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మా సర్వశక్తులూ ఒడ్డుతాం. ఇరాన్ గెలుస్తుంది,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం జరిగే ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు చేసింది. గతంలో ఈ దీవిపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఈ రాత్రికి ఓ జాతి మొత్తం అంతమైపోతుంది… ఇరాన్ ప్రజలను దేవుడే కాపాడాలి: ట్రంప్

Donald Trump warns Iran civilization could end tonight

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ అంగీకరించని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. “ఈ రాత్రికే ఓ నాగరికత మొత్తం అంతమైపోతుంది, మళ్లీ తిరిగి తీసుకురాలేని విధంగా అంతరించిపోతుంది” అని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. 

“అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఇరాన్‌లో ‘సంపూర్ణ పాలన మార్పు’ జరిగి, వివేకవంతులైన, కొత్త ఆలోచనాపరులు అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన అద్భుతాలు కూడా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?” అని ప్రశ్నించారు.

ప్రపంచ సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటని ట్రంప్ అభివర్ణించారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణాలకు ఈ రాత్రితో ముగింపు పడుతుందని ఆయన పేర్కొన్నారు. “గొప్ప ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించాలి” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. ట్రంప్ చేసిన ఈ తీవ్రమైన హెచ్చరిక వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్

Kharg Island Again Under Attack in Iran

ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి దాడులు జరిగాయి. ఖర్గ్‌తో పాటు ఆ దేశంలోని రహదారులు, రైల్వే వంతెనలపై భారీగా దాడులు జరిగాయి. ఇక్కడి మిలిటరీ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. గత నెలలోనూ అమెరికా ఈ ప్రాంతంపై దాడులు చేసింది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించిన విషయం తెలిసిందే.

తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇన్నాళ్లూ యుద్ధం ముగింపు గురించి ఓపికతో ఎదురు చూశామని, ఇక తమ సహనం నశించిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా వాటి మిత్ర దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆయా దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. చమురు, గ్యాస్ సరఫరాకు ఏళ్ల తరబడి అంతరాయం కలిగిస్తామని తెలిపింది.

ఖర్గ్ ద్వీపం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. ఇరాన్ తీరానికి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఇరాన్ దేశం తమ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఖర్గ్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇందులో భాగంగా ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అదనపు బలగాలను మోహరించింది. ఇక్కడ అమెరికా భూతలదాడులకు దిగే అవకాశం కూడా ఉందని అంచనాలు ఉన్నాయి.

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: పైలట్ల పనివేళలపై డీజీసీఏ కీలక నిర్ణయం

DGCA Key Decision on Pilot Work Hours Due to Iran War

ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమానాలు సుదీర్ఘమైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుండటంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర విమానాలకు సంబంధించి పైలట్ల డ్యూటీ సమయ పరిమితుల్లో (FDTL) తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అసాంగ్బా చుబా ఏవో మీడియాకు వెల్లడించారు.

మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో, పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ సమయం పెరిగి, కొత్త డ్యూటీ నిబంధనలను పాటించడం విమానయాన సంస్థలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏప్రిల్ 30 వరకు ఇలాంటి సడలింపులు ఇచ్చారు.

తాజా సడలింపుల ప్రకారం, ఇద్దరు పైలట్లు నడిపే సుదూర విమానాల్లో ‘ఫ్లైట్ టైమ్’ (FT)ను 1.30 గంటలు అదనంగా పెంచి, మొత్తం 11.30 గంటలకు పొడిగించారు. అదేవిధంగా ‘ఫ్లైట్ డ్యూటీ పీరియడ్’ (FDP)ను 1.45 గంటలు పెంచి 11.45 గంటలుగా నిర్ధారించారు. విమానం టేకాఫ్ కోసం కదలడం ప్రారంభించినప్పటి నుంచి, గమ్యస్థానం చేరాక పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని ‘ఫ్లయింగ్ టైమ్’గా పరిగణిస్తారు.

పైలట్ల అలసటను తగ్గించి, విమాన భద్రతను పెంచేందుకు డీజీసీఏ గతేడాది కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పైలట్లకు ఇచ్చే వరుస విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఈ సడలింపులు తాత్కాలికమే అయినప్పటికీ, సిబ్బంది లభ్యత, నిబంధనల పాటింపు వంటి అంశాలపై విమానయాన సంస్థలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని డీజీసీఏ అధికారులు తెలిపారు.

దగ్గరపడుతున్న అమెరికా గడువు… నష్టాల్లో స్టాక్ మార్కెట్

Donald Trump Deadline Nears Stock Market Plunges

హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తోంది.

ఉదయం గం.9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 529 పాయింట్లు కోల్పోయి 73,576 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయింది.

కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns Iran of Destruction After Ceasefire Rejection

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు గడువు విధిస్తున్నామని, ఆలోగా దిగిరాకపోతే ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే పూర్తిగా ఆక్రమించుకోగలమని, నాశనం చేయగలమని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈజిప్టు, తుర్కియే, పాకిస్థాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి రూపొందించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక విరామం శత్రువులు తిరిగి బలం పుంజుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, అందుకే తాము అంగీకరించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనికి బదులుగా, యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకాలనే డిమాండ్‌తో పాటు మొత్తం 10 షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మాజిద్ ఖదేమీ, రహస్య దళం అధిపతి అస్గర్ బకేరీ సహా 25 మంది మరణించినట్లు సమాచారం.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. దాడులు, బెదిరింపులతో తమ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, అమెరికా దాని మిత్రదేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ ప్రకటనలో హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, ఖతార్, యూఏఈపై క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో తదుపరి ఏం జరగనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

హర్మూజ్ వద్ద ఇరాన్ అనుమతి నిరాకరణ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ ఇబ్బందులు

Hormuz Strait Iran Denies Permission Causing Global LNG Issues

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రారంభమై 39 రోజులవుతోంది. యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలను ఇరాన్ అనుమతించడం లేదు. ఆ దేశం అనుమతితో కొన్ని చమురు, గ్యాస్ కంటైనర్లు మాత్రం ఈ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ మీదుగా ఇరాన్ అనుమతి నిరాకరించడంతో గల్ఫ్ జలాల్లో సరుకు రవాణా నౌకలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడిస్తోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ క్షణం ఎటువైపు వెళుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శాశ్వత శాంతి కోసం ఇరాన్ డిమాండ్ చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంది. దీంతో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇది అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతోంది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ మీదుగా ఇరాన్ ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్‌కు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇటీవల ఖతార్ నుంచి వచ్చిన రెండు ట్యాంకర్లను కూడా ఇరాన్ అనుమతించలేదు. దీంతో అవి వెనక్కి మళ్ళినట్లు తెలుస్తోంది. జలసంధి వద్ద ఇరాన్ అనుమతి నిరాకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!

Iran US Conflict US Suffers Heavy Losses 40 Aircraft Destroyed

వారం రోజుల్లో ముగిసిపోతుందని భావించిన ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి అంచనాలను తలకిందులు చేస్తోంది. యుద్ధం మొదలై 37 రోజులు గడుస్తున్నా ఇరాన్ గట్టి ప్రతిఘటన చూపిస్తుండటంతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇప్పటివరకు అమెరికాకు చెందిన 40 వైమానిక సంపత్తి ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పడుతోంది. “ఇరాన్‌కు రాడార్లు, విమాన విధ్వంసక వ్యవస్థలు లేవు, మా విమానాలు సులువుగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయి” అని ఏప్రిల్ 1న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అమెరికా కోల్పోయిన వాటిలో 4 ఎఫ్-15ఈ ‘స్ట్రైక్ ఈగిల్’ ఫైటర్ జెట్లు, 17 ఎంక్యూ-9 ‘రీపర్’ డ్రోన్లు, 2 ఏ-10 ‘వార్తగ్’ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 8 కేసీ-135 ఇంధన ట్యాంకర్లు, 2 ఈ-3 ఎర్లీ వార్నింగ్ విమానాలు, 2 సీ-130 రవాణా విమానాలు దెబ్బతిని నిలిచిపోయాయి. మార్చి 19న జరిగిన ఒక దాడిలో, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎఫ్-35 ‘లైట్నింగ్ II’ ఫైటర్ జెట్ దెబ్బతినడం ఇదే తొలిసారి.

ముఖ్యంగా, అమెరికా డ్రోన్ల దళానికి వెన్నెముక లాంటి 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోవడం వ్యూహాత్మకంగా పెద్ద నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఘాతో పాటు క్షిపణులను ప్రయోగించగల ఈ డ్రోన్లను ఇంత భారీ సంఖ్యలో కోల్పోవడంతో, మెరుగైన రక్షణ వ్యవస్థలున్న కొత్త డ్రోన్ల అభివృద్ధిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ యుద్ధంలో ఇరాన్ కూడా సుమారు 40 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో ఎక్కువ భాగం పాత చైనా నిర్మిత జే-7 ఫైటర్లే ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే, ఒక్క ఫైటర్ జెట్‌ను కూడా కోల్పోనప్పటికీ, 18 మానవరహిత విమానాలను (యూఏవీలు) నష్టపోయింది.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

Iran youth form human chain protesting Trumps threats

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో ఇరాన్ అప్రమత్తమైంది. అమెరికా హెచ్చరికలకు నిరసనగా దేశంలోని కీలక విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలు ఏర్పాటు చేయాలని తమ యువతకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

గడువులోగా ఇరాన్ దిగిరాకపోతే దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లను, వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “ఒకే రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టగలం. ఆ రాత్రి రేపే కావచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ నేరాల ఆరోపణల గురించి అడగ్గా, తాను వాటి గురించి అస్సలు పట్టించుకోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతూ ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై దాడి చేసింది.

ఈ మానవహారం కార్యక్రమాన్ని యువత సూచన మేరకే నిర్వహిస్తున్నట్లు ఇరాన్ యువజన వ్యవహారాల ఉప మంత్రి అలీరెజా రహిమి తెలిపారు. “ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం” పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దేశ మౌలిక సదుపాయాలను కాపాడుకోవడంలో యువత నిబద్ధతను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, దౌత్యపరమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధానికి శాశ్వత ముగింపుతో పాటు, తమపై మళ్లీ దాడి జరగదని హామీ కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తమ 10 సూత్రాల ప్రణాళికను మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇరు పక్షాలకు చెందిన అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రైలు ప్రయాణాలపై ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Israel Warns Iranians Against Train Travel

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్‌లోని రైళ్ల రాకపోకలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలు చేయొద్దని, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పోస్టు పెట్టింది.

మీ భద్రత దృష్ట్యా ఇప్పటినుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల మార్గాలకు దూరంగా ఉండాలని, రైలు ప్రయాణాలు మానుకోవాలని ఆ పోస్టులో సూచించింది. అక్కడ మీరు ఉంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని పేర్కొంది. ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది. దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది. అయితే ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు.

దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

Iranian President Ready to Sacrifice Life for Country

ఇరాన్ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. దేశానికి చెందిన 14 మిలియన్లకు పైగా ఇరాన్ ప్రజలతో పాటు తానూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కాల్పుల విరమణకు పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని అన్నారు. ఇరాన్ కోసమే నిలబడ్డాను, ఇక ముందు కూడా నిలబడతానని పేర్కొన్నారు.

ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని అనేక స్థావరాలను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈసారి డెడ్‌లైన్ పొడిగింపు ఉండదని, ఇరాన్‌ను తమ బలగాలు ఒక్క రాత్రికే తుడిచి పెట్టేయగలవని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ధీటుగా స్పందించారు. అమెరికా తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని, తమ శాశ్వత డిమాండ్లు అంగీకరించాలని చెబుతోంది. తాను, తమ దేశ ప్రజలు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్‌కు దగ్గరవుతున్న పాక్… ఈ నెలలో అప్పు తీర్చాల్సిందేనన్న యూఏఈ

Pakistan Faces Debt Crisis as UAE Demands Loan Repayment

తీవ్ర అప్పుల భారంతో కుంగిపోతున్న పాకిస్థాన్ మరో పెను ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. ఈ నెలలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 వేల కోట్లు) భారీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆ దేశ విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన తరుణంలో, ఈ చెల్లింపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని పాక్ కేబినెట్ మంత్రి ఒకరు ధృవీకరించినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది.

గతంలో స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొంది, వాటిని ‘రోలోవర్’ (గడువు పొడిగింపు) చేయించుకుంటూ పాకిస్థాన్ నెట్టుకొచ్చేది. అయితే, ఈసారి రోలోవర్‌కు యూఏఈ నిరాకరించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మారిన భౌగోళిక రాజకీయ సమీకరణాలే అబుదాబి కఠిన వైఖరికి కారణమని శ్రీలంకకు చెందిన ‘గార్డియన్’ పత్రిక తన కథనంలో విశ్లేషించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల్లో పాకిస్థాన్ ఇరాన్‌కు దగ్గరగా ఉందనే భావన గల్ఫ్ దేశాలతో, ముఖ్యంగా యూఏఈతో సంబంధాలను క్లిష్టతరం చేసిందని పేర్కొంది.

ఈ భారీ చెల్లింపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. విదేశీ మారక నిల్వలు మరింత పడిపోయి దిగుమతులకు చెల్లింపులు జరపడం, కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవడం కష్టతరం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పర్యవేక్షణలో ఆర్థిక సంస్కరణలు చేపడుతున్న పాకిస్థాన్‌కు ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బేనని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గతంలో పాకిస్థాన్‌కు యూఏఈ ఆర్థికంగా అండగా నిలిచింది. 2018లో 2 బిలియన్ డాలర్ల సాయం అందించగా, 2023లో మరో 1 బిలియన్ డాలర్ల కోసం పాక్ అభ్యర్థించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అప్పులో కొంత భాగాన్ని పెట్టుబడిగా మార్చుకునే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నా, అవి ఎంతవరకు ఫలిస్తాయోనన్న అనిశ్చితి నెలకొంది. మొత్తంగా, ఈ సంక్షోభం పాక్ ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక బలహీనతలను (తక్కువ ఎగుమతులు, అధిక ద్రవ్యలోటు) మరోసారి బహిర్గతం చేసింది.

Related posts

సంపన్నులకు అమెరికాలో శాశ్వత నివాసం ఇక సులభం.. డిసెంబర్‌లో రానున్న ‘గోల్డ్ కార్డ్’

Ram Narayana

ట్రంప్ హత్యకు కుట్ర కేసులో నిందితుడు రాన్ రౌతుకు జీవిత ఖైదు

Ram Narayana

బీచ్‌లో గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై రూ. 2 లక్షల ఫైన్.. కెనరీ ఐల్యాండ్స్ నిర్ణయం

Ram Narayana