జాతీయ వార్తలు

57 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల..

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర జులై 3న ప్రారంభమై, 57 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగుస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా వివరాలను పంచుకుంది.

షెడ్యూల్ ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా శివుని ఆశీస్సులు కోరుతూ ‘ప్రథమ పూజ’ నిర్వహిస్తారు. యాత్ర కోసం ఈ నెల‌ 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జమ్మూకశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‍బీఐ, యస్ బ్యాంక్‌లకు చెందిన 554 బ్రాంచుల ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు.

భక్తులు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవ‌చ్చు. ఒకటి సాంప్రదాయ పహల్గామ్ మార్గం కాగా, మరొకటి బల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది, దీనికి 3-5 రోజులు పడుతుంది. బల్తాల్ మార్గం 14 కిలోమీటర్లు మాత్రమే ఉండి, యాత్ర పూర్తి చేసి అదే రోజు బేస్ క్యాంప్‌కు తిరిగి రావచ్చు. ఈ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

Related posts

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించిన మోదీ.. !

Ram Narayana

మరో సారి గొప్పలు చెప్పుకున్న పాక్ ప్రధాని… ఐఎన్ఎస్ విక్రాంత్ పై దాడి చేశారట!

Ram Narayana

త్వరలో భారత్‌లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే!

Ram Narayana