ఎమ్మెల్సీ ల ఎన్నికల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన టీఆర్ యస్ …బలహీనవర్గాల పెదవి విరుపు!
-ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
-ముగ్గురు రెడ్లు , ఒక వెలమ ,ఒక ఎస్సీ ,ఒక ముదిరాజ్ లకు చోటు
-సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి ,గుత్తా సుఖేందర్ రెడ్డి , కౌశిక్ రెడ్డి జాబితాలో
-కడియం, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లిలకు అవకాశం
-మిగతాపార్టీలకు బలం లేని వైనం
-ఏకగ్రీవంగా గెలవనున్న అభ్యర్థులు
టీఆర్ యస్ ప్రకటించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అధికార టీఆర్ యస్ రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది. అధికార పార్టీకి శాసనసభలో ఎంఐఎం తో కలిసి 110 మంది శాసనసభ్యులు ఉండటంతో బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తారని భావించినప్పటికీ అందుకు విరుద్ధంగా కేసీఆర్ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇవ్వడం పై పార్టీలోని బలహీన వర్గాల వారు పెదవి విరుస్తున్నారు . మిగతా అభ్యర్థులు కూడా ఒక వెలమ, ఒక ముదిరాజ్ ఒక ఎస్సీ లకు ఎమ్మెల్సీ ల సీట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ లాంటి అపార చాణిక్యుడు సీట్లు ఎంపికలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది . మైనార్టీ లకు గని , మిగతా కులాలను అసలు పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు ఉన్నాయి. ఓ సి లలో కూడా కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం . అసలు తెలంగాణ మండలిలో కమ్మ సామాజికవర్గం ప్రాతినిధ్యం లేదు . నాలుగైదు జిల్లాలో ప్రభావం చూపగలిగిన కులంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం పై ఆ సామాజికవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రకటించారు. నిన్న ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు.
ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాశ్, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డిల పేర్లు ఉన్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ అసెంబ్లీకి చేరుకున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఈ ఆరు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.