లుథియానా కోర్టులో పేలుడు కేసు.. పచ్చబొట్టు సాయంతో అనుమానితుడి గుర్తింపు!
- లుథియానా కోర్టులో గురువారం బాంబు పేలుడు
- నిందితుడు మాజీ హెడ్ కానిస్టేబుల్
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో రెండేళ్ల జైలు
- సెప్టెంబరులోనే బెయిలుపై బయటికి
సంచలనం సృష్టించిన పంజాబ్‌లోని లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాంపై ఉన్న పచ్చబొట్టు, లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడిని మాజీ హెడ్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడైన ఆ కానిస్టేబుల్ గతంలో మాదకద్రవ్యాలను తరలిస్తూ పట్టుబడ్డాడు. 2019లో అతడిని విధుల నుంచి తొలగించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అతడి పేరు గగన్‌దీప్ సింగ్ (30) అని, ఖన్నాలోని లాల్‌హెరీ రోడ్డులో నివసించేవాడని అధికారి చెప్పారు. ఆగస్టు 2019లో అరెస్ట్ అయ్యాడని, రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో బెయిలుపై జైలు నుంచి విడుదలైనట్టు వివరించారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రావాల్సి ఉండగా ముందురోజే అతడు కోర్టుకు ఎందుకు వచ్చాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అతడు మాజీ కానిస్టేబులేనని డిప్యూటీ సీఎం, హోంమంత్రి సుఖ్‌జీందర్ సింగ్ రంధావా కూడా నిర్ధారించారు. సిక్కు మత చిహ్నమైన ‘ఖాండా’ అనే పచ్చబొట్టును అతడు పొడిపించుకున్నట్టు పోలీసులు తెలిపారు.