- కేంద్రం పెంచుతున్న ధరలపై టీఆర్ఎస్ నిరసనలు
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శనలు
- పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపు
కేంద్ర ధరల పెంపునకు నిరసనగా గురువారం నాడు తెలంగాణవ్యాప్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న ఈ నిరసనల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, నిరసనలను హోరెత్తించాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోందని ఆరోపించిన టీఆర్ఎస్… ఆ ధరల పెరుగుదలకు నిరసనగానే రేపు ఆందోళనలు చేపట్టనుంది. ఇప్పటికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వాదిస్తున్న కేసీఆర్.. తాజాగా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.