Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ గవర్నర్ ఢిల్లీ టూర్ హాట్ హాట్ …

ప్ర‌ధానిని క‌లిసింది తెలంగాణ స‌ర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాదు: గవర్నర్ త‌మిళిసై

  • తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఒక పేరును సేవా రంగంలో ప్ర‌తిపాదించింది
  • ప్ర‌భుత్వం సూచించిన ఆ వ్య‌క్తికి అర్హ‌త లేదు
  • నా అభిప్రాయాన్ని నేను చెప్పాను
  • తెలంగాణ‌లో త‌న‌కు ఎవ‌రితోనూ విభేదాలు లేవ‌న్న గ‌వ‌ర్న‌ర్

తెలంగాణ గవర్నర్ తమిళశై ఢిల్లీ టూర్ హాట్ హాట్ గా మారింది. ఇటీవల గవర్నర్ ,తెలంగాణ ప్రభుత్వం మధ్య తీవ్రమైన అంతరం ఏర్పడింది. అసలే బీజేపీతో గొడవలు , వడ్లు కొనుగోలుపై యుద్ధం జరుగుతున్న వేళ గవర్నర్ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో వివాదంలోకి నెట్టింది. ప్రభుత్వానికి ఆమె కు మధ్య ఉన్న గ్యాప్ పై ఢిల్లీ లో గవర్నర్ స్పందించారు. తనను కాదు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అవమాన పరుస్తుందని ఆమె అన్నారు . తాను స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తినని , వివాదాలకు తాను దూరంగా ఉంటానని , అదే సందర్భంలో రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు . ఇంకా ఢిల్లీ విశేషాలు ఆమె మాటల్లోనే …

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని మోదీతో స‌మావేశం అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ నియామ‌కంలో వివాద‌మేమీ లేదని చెప్పారు. తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఒక పేరును సేవా రంగంలో ప్ర‌తిపాదించింద‌ని ఆమె అన్నారు.

అయితే, ప్ర‌భుత్వం త‌న‌కు సూచించిన ఆ వ్య‌క్తికి అర్హ‌త లేద‌ని తాను భావించాన‌ని, త‌న అభిప్రాయాన్ని తాను చెప్పాన‌ని స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం, వ్య‌వ‌స్థ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు గౌర‌వించాల‌ని, వాటి ప్ర‌కార‌మే న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని ఆమె చెప్పారు. ప్ర‌ధాని మోదీతో ప‌లు అంశాల‌పై చ‌ర్చించాన‌ని, ప్ర‌జా సంక్షేమ‌ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేశార‌ని ఆమె అన్నారు.

అంతేగానీ, తాను ప్ర‌ధానిని క‌లిసింది తెలంగాణ స‌ర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాద‌ని ఆమె చెప్పారు. తెలంగాణ‌లో త‌న‌కు ఎవ‌రితోనూ విభేదాలు లేవ‌ని ఆమె తెలిపారు. కాగా, ఇటీవల తెలంగాణ‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమిళిసై ఢిల్లీ పర్య‌టిస్తుండ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది.

కాసేప‌ట్లో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర‌ హోంశాఖ పిలుపు మేరకే ఆమె ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి వ్య‌వ‌హారం నుంచి శాస‌న‌ మండలి ప్రొటెం ఛైర్మన్ నియామకం, త‌దిత‌ర‌ పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు వ‌చ్చాయంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ‌ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై త‌మిళిసై అప్ప‌ట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంత‌రం కూడా వ‌రుస‌గా ప‌లు ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ అంశాల‌పై కేంద్ర మంత్రుల‌తో త‌మిళిసై చ‌ర్చిస్తార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమె నేడు మీడియా స‌మావేశంలో మాట్లాడి వివ‌ర‌ణ ఇచ్చారు.

Related posts

5 Easy Tips On How To Plan A Balanced Diet For Glowing Skin

Drukpadam

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ లో మ‌ళ్లీ ఏపీనే నెంబ‌ర్ వ‌న్‌!

Drukpadam

వెన్నెముక నుంచి వేరుపడ్డ బాలుడి తల.. తిరిగి జోడించిన వైద్యులు!

Drukpadam

Leave a Comment