ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్ జిల్లాల పర్యటన!
- ఇప్పటికే ఏపీ సర్కారు వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు
- జిల్లాల పర్యటలను పెంచే దిశగా జగన్
- ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ బస్సు అవసరమన్న భద్రతా సిబ్బంది
- ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన సందర్భంగా కార్లతో కూడిన కాన్వాయ్‌నే వినియోగిస్తున్నారు. ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సులను ఆయన తన జిల్లాల పర్యటనల్లో వినియోగించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జిల్లాల పర్యటనలో సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులనే వినియోగిస్తారని, ఆ దిశగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులను ఏర్పాటు చేయాలంటూ ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
వాస్తవానికి ఏపీ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులున్నాయి. ఓ బుల్లెట్ ప్రూఫ్ బస్సును 2009లో కొనుగోలు చేయగా.. మరోదానిని 2015లో కొనుగోలు చేశారు. అయితే గడచిన మూడేళ్లుగా జగన్ ఈ బస్సుల వైపే చూడలేదు. ఎన్నికలు సమీపిస్తుండటం, జిల్లాల పర్యటనలను మరింతగా పెంచే దిశగా జగన్ సాగుతున్న నేపథ్యంలో ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లోనే సీఎం తిరగాలంటూ ఆయన భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి సూచించినట్టుగా సమాచారం.
ఈ సూచనలతోనే బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న బుల్టెట్ ప్రూఫ్ బస్సులనే జగన్ వినియోగిస్తారా? లేదంటే ఆయన కోసం కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొంటారా? అన్నది తెలియాల్సి ఉంది.