Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మీ వినాశనానికే ఇదంతా చేస్తున్నారు: ఈటల రాజేందర్…

మీ వినాశనానికే ఇదంతా చేస్తున్నారు: ఈటల రాజేందర్…
-ఏడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారన్న ఈటల
-అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపాటు
-కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించనని వ్యాఖ్య

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ చివరి వరకు ఆయనపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ పోచారం తెలిపారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన ఈటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులతో ఈటల వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం ఎక్కేందుకు ఆయన నిరాకరించారు. తన సొంత వాహనంలోనే వెళ్తానని చెప్పారు. అయినప్పటికీ.. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనం ఎక్కించి శామీర్ పేటలోని ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసల మాదిరి బతకొద్దని అన్నారు.

మరోవైపు, కేసీఆర్ పై ఈటల మండిపడ్డారు. ఆయన నాశనానికే ఇందంతా చేస్తున్నారని అన్నారు. ఏడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారని… ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి నుంచి తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడనని వ్యాఖ్యానించారు

ఈటల మాట్లాడిన దాంట్లో తప్పేముంది.. కేసీఆర్ ను ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు: బండి సంజయ్
స్పీకర్ ను మరమనిషి అంటే తప్పేముందన్న సంజయ్
మోదీని కేసీఆర్ ఫాసిస్ట్ అనలేదా? అంటూ ప్రశ్న
ప్రధాని గురించి అగౌరవంగా మాట్లాడిన కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని వ్యాఖ్య

 

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అన్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈటల చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మీరు చెప్పినట్టు ఆడే స్పీకర్ ను మరమనిషి అంటే తప్పేముందని అడిగారు. నిండు సభలో ప్రధాని మోదీని ఫాసిస్ట్ అని కేసీఆర్ అన్నారని… ప్రధానిపై సభలో అగౌరవంగా మాట్లాడిన కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు అంటేనే కేసీఆర్ భయపడుతున్నారని… అందుకే అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనీయడం లేదని మండిపడ్డారు. విపక్ష సభ్యుల సలహాలను కూడా తీసుకోవడం లేదని అన్నారు. ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసిన అంశంపై న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు.

శాసనసభ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్
స్పీకర్ ను మరమనిషి అన్నారని టీఆర్ఎస్ ఆగ్రహం
సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరిన శాసనసభ వ్యవహారాల మంత్రి
ఈ సెషన్ వరకు ఈటలను సస్పెండ్ చేసిన స్పీకర్

 

తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభలో రచ్చ చోటు చేసుకుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరమనిషి అన్నారని… స్పీకర్ కు ఆయన క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించారు.

దీంతో, స్పీకర్ ఛైర్ ను అగౌరవపరిచిన ఈటలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. దీంతో, ఈటలపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈటలను సస్పెండ్ చేయడంపై బీజేపీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Related posts

బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర :కేటీఆర్ ఫైర్!

Drukpadam

పెద్ది రెడ్డి ,రఘురామ కృషంరాజుల మధ్య మాటల యుద్ధం

Drukpadam

చంద్రబాబు వాహనంపై రాళ్లదాడికి యత్నం…

Drukpadam

Leave a Comment