కమ్యూనిస్ట్ లతో బంధం కొనసాగిస్తాం …వారి మద్దతు వల్లనే గెలిచాం :మంత్రి జగదీష్ రెడ్డి!
-కమ్యూనిస్టుల ప్రచారంతోనే మునుగోడులో టీఆర్ఎస్ కు గెలుపు
-మునుగోడులో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్
-కూసుకుంట్లతో కలిసి వామపక్ష పార్టీల కార్యాలయాలకు వెళ్లిన జగదీశ్ రెడ్డి
-భవిష్యత్తులోనూ వామపక్షాలతో కలిసి సాగనున్నట్లు వెల్లడి
హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి… ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి… మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఐ, సీపీఎం నేతలు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామనే సంతోషం తమకూ ఉందని ఈ సందర్భంగా కూనంనేని తెలిపారు.
కమ్యూనిస్టుల మద్దతు లేకపోతె టీఆర్ యస్ గెలవడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నది . కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు లు కూడా టీఆర్ యస్ కలిసి నడిచేందుకు అంగీకరించినట్లు టీఆర్ యస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు , టీఆర్ యస్ తో కలిసి వెళ్లడం ఖాయం అంయిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు . రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు జరిగే అవకాశాలు తోసిపోచలేమని అంటున్నారు పరిశీలకులు …