తారకరత్న నివాసంలో పక్కపక్కనే కూర్చున్న చంద్రబాబు , బాలకృష్ణ, విజయసాయిరెడ్డి…
తారకరత్న నివాసానికి వచ్చిన బాలకృష్ణ
తారకరత్న భౌతికకాయానికి నివాళులు
తారకరత్న భార్య, కుమార్తెను పరామర్శించిన బాలయ్య
నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి నారా చంద్రబాబు నాయుడు ,ఎంపీ విజయసాయి రెడ్డి , ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ మధ్యాహ్నం మోకిలలోని తారకరత్న నివాసానికి వచ్చిన బాలకృష్ణ… తారకరత్నను విగతజీవుడిగా చూడడంతో భావోద్వేగాలకు గురయ్యారు. తారకరత్న భార్య అలేఖ్యను, ఆయన కుమార్తె నిషికను పరామర్శించారు. కాగా, తారకరత్న నివాసంలో చంద్రబాబు , బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని ఉండడం మీడియా దృష్టిని ఆకర్షించింది.ఈసందర్భంగా చంద్రబాబు , బాలయ్య, విజయసాయి వేరు వేరుగా చర్చించుకుంటూ కనిపించారు. తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురే. దాంతో విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు వరుస అవుతారు. ఉప్పునిప్పుగా ఉండే చంద్రబాబు , విజయసాయి లు పక్కపక్కనే కూర్చొని చర్చించుకోవడం మీడియా కంటపడటం వారు కెమెరాలకు పనిచెప్పడం జరిగిపోయాయి. అయితే వారు తారకరత్న వైద్యం వివరాలు గురించి చర్చించుకున్నట్లు తెలుస్తుంది.
తారకరత్న పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు

తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. ఆయన చిత్ర పటం వద్ద పుష్ఫాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడారు. తారకరత్నకు అందిన వైద్యం, అంత్యక్రియల ఏర్పాట్లపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. తారకరత్నను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఈ నెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. ‘అమరావతి’ సినిమాలో నటనకు నందీ అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారు. ఈ మారు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు చెప్పారు. మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని తారకరత్నతో అన్నా. అలాంటి టైంలో ఆయన చనిపోవడం బాధాకరం’’ అని చంద్రబాబు అన్నారు.
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈరోజు హైదరాబాద్ మోకిలలోని తారకరత్న నివాసానికి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ చేరుకున్నారు. సోదరుడి పార్థివ దేహాన్ని చూసి వారు భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు.
గుండెపోటుకు గురై కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇంకెందరో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన లోకేశ్, బ్రాహ్మణి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి అశ్రునయనాలతో నందమూరి తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తారకరత్న మృతి సమాచారం తెలుసుకుని పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేశ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం..తన సతీమణితో కలిసి మోకిల నివాసానికి చేరుకుని తారకరత్నకు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పుష్ఫాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తారకరత్న కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.
తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. జనవరి 27న లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనను చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. తారకరత్న మృతిపై ప్రధానితో సహా పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

