చాట్‌జీపీటీతో యువకుడికి రూ.28 లక్షల ఆదాయం!
- చాట్‌జీపీటీ వినియోగంపై వీడియో కోర్సు ప్రారంభించిన అమెరికా యువకుడు
- యూడెమీ యాప్‌లో అతడి కోర్సుకు అనూహ్య స్పందన
- భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, లక్షల్లో ఆదాయం
- చాట్‌జీపీటీపై అపోహలు తొలగించడమే తన లక్ష్యమంటున్న యువకుడు
ప్రస్తుతం కృత్రిమ మేథ రంగంలో చర్చ అంతా చాట్‌జీపీటీ చుట్టూ తిరుగుతోంది. ఆసాధారణ సామర్థ్యం గల ఇలాంటి ఏఐ అప్లికేషన్లతో కలిగే ప్రమాదాల గురించి కూడా చర్చ మొదలైంది. అయితే, కృత్రిమ మేథపై పరిశోధనలకు కొంత విరామం ఇవ్వాలని, ప్రస్తుత పరిస్థితులను, రాబోయే పరిణామాలను నిశితంగా బేరీజు వేసుకోవాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ కొత్త సాంకేతికతను ఓ అమెరికా యువకుడు ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ఇప్పటివరకూ ఏకంగా రూ.23 లక్షలను(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) సంపాదించాడు.
ఆస్టిన్ రాష్ట్రానికి చెందిన లాన్స్ జంక్ గతేడాది నవంబర్‌లో తొలిసారిగా చాట్‌జీపీటీని చూశాడు. ఆ తరువాత చాట్‌జీపీటీ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఈ చాట్‌బాట్ అసాధారణ సామర్థ్యాలు చూసి అతడి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయితే, చాట్‌జీపీటీ ఉపయోగాలపై యువతలోనూ అవగాహన లోపించడం అతడిని ఆలోచనలో పడేసింది. ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, అపోహలు ఉన్న విషయాన్ని గుర్తించాడు. దీంతో.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు యూడెమీ ప్లాట్ ఫాంలో చాట్‌జీపీటీ మాస్టర్ క్లాస్ పేరిట వీడియో తరగతుల సిరీస్‌ను ప్రారంభించాడు.
ఈ కోర్సుకు ప్రజల నుంచి అతడు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. 20 ఏళ్ల వయసున్న యువత నుంచి 50వ పడిలో ఉన్న వారివరకూ అనేక మంది ఈ కోర్సులో చేరారు. అమెరికాతో పాటూ కెనడా, ఇండియా వారు కూడా ఈ కోర్సును సబ్‌స్క్రైబ్ చేశారు. దీంతో, అతడిపై కనకవర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. చాట్‌జీపీటీపై అపోహలను తొలగించి దీన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే తన లక్ష్యమని లాన్స్ చెప్పుకొచ్చాడు.
చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ
- టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చాట్ జీపీటీ
- కృత్రిమ మేధ సాయంతో అద్భుత సృష్టి
- అయితే చాట్ జీపీటీపై పలు దేశాల సందేహం
- ఇప్పటికే నిషేధించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్
- అదే బాటలో ఇటలీ
ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న చాట్ జీపీటీ ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏదైనా అంశం ప్రస్తావించినప్పుడు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపడం చాట్ జీపీటీ ప్రత్యేకత.
చరిత్ర, కవితలు, కళలు, సాహిత్యం, రచనలు, వైద్య రంగం, రక్షణ రంగం, అంతరిక్షం, వ్యవసాయం, విద్య, పరీక్షలు, క్రీడలు… ఇలా ఏ రంగానికి చెందిన సమాచారం కావాలన్నా, సలహా కావాలన్నా చాట్ జీపీటీ వెంటనే అందిస్తుంది. చాట్ జీపీటీని కలిగి ఉంటే ఓ అపర మేధావి మన పక్కన ఉన్నట్టే!
అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా… ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ కూడా నడిచింది. చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇటలీ భద్రతా నిబంధనలకు ఇది లోబడి ఉందా? లేదా? అనే అంశం పరిశీలిస్తామని వెల్లడించింది.