రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు కోసం పార్టీని విలీనం చేస్తాం …కోందండరాం సంచలన ప్రకటన …
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కోదండరాం..
కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేందుకు ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపు
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పని చేస్తామని ప్రకటన
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన సాగించడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోందండరాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . కేసీఆర్ ను గద్దె దించేందుకు అవసరమైతే తమ పార్టీని ఏ పార్టీలోనైనా విలీనం చేస్తామని
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సంచలన ప్రకటన చేశారు . వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు.
ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు.
ప్రజాస్వామ్య తెలంగాణ నియంతృత్వ పాలన లో మగ్గుతుందన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేస్తుందన్నారు. హక్కుల కోసం, న్యాయం కోసం ఉద్యమించిన రైతులను, నిరుద్యోగ యువతను కేసులు, జైలు పాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో నేడు నోరు విప్పి న్యాయం కోసం అడిగే పరిస్థితి లేదన్నారు. ప్రగతిభవన్ కి వెళ్లాలంటే నిర్బంధిస్తున్నారన్నారు.
అరెస్టులు అక్రమాల మధ్య నిరంతరం కొట్లాడుతూనే ఉన్నామన్నారు. రాజకీయాలు మారాలి అనే భావంతో ధర్మ బిక్షం, సుందరయ్య వంటి వారు డబ్బులతో కాకుండా విలువలతో రాజకీయాలు చేశారన్నారు. నేడు ఆస్తుల కోసమే రాజకీయాల అనే విధంగా తెలంగాణలో పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం ఏ పథకం పెట్టిన కమిషన్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్న భావం నెలకొందన్నారు.
పరీక్షల నిర్వహణ సక్రమంగా లేక పేపర్ల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. భూసేకరణ పేరుతో రైతుల భూమిని దోపిడీ చేస్తున్నారన్నారు. దళిత, గిరిజనుల భూములను ప్రభుత్వమే లాక్కుంటుందన్నారు. చిన్న సన్నకారు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాన్యం అమ్ముకోవడానికి కూడా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు.
రైతులకు రైతుబంధు పేరు చెప్పి ఇతర ప్రభుత్వ సహకారాలన్నీ నిలిపివేశారన్నారు. రైతు రుణమాఫీ చేయకుండా రైతులను అప్పులపాలు చేశారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించకుండా వేధిస్తుందన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులను సమ్మె హక్కు లేకుండా అణచివేస్తూ ప్రభుత్వం నియంతృత్వంగా మారిందని ధ్వజమెత్తారు
ధరణితో రైతులందరూ తిప్పలు పడుతున్న విషయాన్నీ గుర్తు చేసారు . మహిళలకు పావులా వడ్డీ లేదన్నారు. కౌలు రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. సింగరేణి లో ఉత్పత్తి పెరిగినా కార్మికుల ఉద్యోగాల సంఖ్య 48 వేలకు తగ్గించడం దారుణమన్నారు .
సర్పంచులకు సైతం ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తుందన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రజా సమస్యలపై నిరంతరం టీజేఎస్ పోరాడుతూనే ఉందన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు రైతులు మహిళలు ఉద్యోగుల సమస్యలపై మునుముందు టీజ్ఎస్ మరిన్ని పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.
విద్య వైద్యం అందరికీ అందించాలని టీజేఎస్ లక్షమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
సభలకు టీజేఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.