ఒప్పందం ప్రకారం సహజీవనం చేసినా దాన్ని వివాహం అనలేం: కేరళ హైకోర్టు
- 2006 నుంచి సహజీవనం చేస్తున్న జంట
- రిజిస్టర్డ్ ఒప్పందం ప్రకారం సహజీవనం
- విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం
- సహజీవనం చేస్తూ విడాకులేంటన్న కేరళ హైకోర్టు
సహజీనవంపై కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒప్పందం ప్రకారం సహజీవనం చేసినంత మాత్రాన దాన్ని వివాహం అనలేమని స్పష్టం చేసింది. అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన జంట విషయంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన ఈ జంట 2006 నుంచి సహజీవనం చేస్తున్నారు. రిజిస్టర్ ఒప్పందం ప్రకారం సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఓ కుమార్తె కూడా ఉంది. ఇక కలిసి ఉండలేమన్న ఉద్దేశంతో ఈ జంట విడాకుల కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది.
ఈ నేపథ్యంలో, భారతదేశంలో వ్యక్తిగత, లౌకిక చట్టాలను అనుసరించి జరిగే వివాహాలనే తాము గుర్తిస్తామని జస్టిస్ మహ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్ లతో కూడిన కేరళ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
సహజీవనం ఎప్పటికీ చట్టబద్ధ వివాహం కాబోదని, అలాంటప్పుడు సహజీవనంలో విడాకులకు తావులేదని వివరించింది. ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన సహజీవనంలో విడాకులు అడిగే అర్హత లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు వారి పిటిషన్ ను కొట్టివేసింది.