మోదీ, యోగిలను చంపేస్తానంటూ ఫోన్ కాల్.. యూపీ పోలీసుల అలర్ట్…
- ఉత్తరప్రదేశ్ పోలీస్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన ఆగంతుకుడు
- మద్యం మత్తులో బెదిరింపులకు పాల్పడ్డ వైనం
- గోరఖ్ పూర్ లో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపులకు పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
సోమవారం యూపీ పోలీసుల హెల్ప్ లైన్ 112 కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ప్రధాని, సీఎంలను చంపేస్తానని బెదిరించాడు. తన పేరు అరుణ్ కుమార్ అని, గోరఖ్ పూర్ లోని భుజౌలి కాలనీ నివాసినని చెప్పాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. గోరఖ్ పూర్ జిల్లాలోని దేవ్రద్ గ్రామం నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. గ్రామానికి వెళ్లి విచారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా.. మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.