- ఆమ్ ఆద్మీ పార్టీని ఛిన్నాభిన్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపణ
- త్వరలో తాను సహా మరో నలుగురు ఆప్ నేతల అరెస్టు
- ఇదంతా రాజకీయ ప్రతీకారమేనన్న అతిశీ
ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని అస్తవ్యస్తం చేయడమే కేంద్రంలోని అధికార బీజేపీ లక్ష్యమని ఢిల్లీ మినిస్టర్ అతిశీ విమర్శించారు. బీజేపీలో చేరాలంటూ తన సన్నిహితుల ద్వారా ఆహ్వానం అందిందని చెప్పారు. దీంతోపాటే హెచ్చరికలు కూడా అందాయని ఆరోపించారు. బీజేపీలో చేరకుంటే త్వరలో తనను అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారని చెప్పారు. అయితే, బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు, రాజకీయ ప్రతీకార దాడులకు తాను భయపడబోనని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరేది లేదని వారికి స్పష్టం చేశానని వివరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీని ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని అతిశీ మండిపడ్డారు. మరో నెల రోజుల్లో తనతో పాటు ఆప్ కీలక నేతలు నలుగురిని అరెస్టు చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోందని అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేజ్రీవాల్ ను జైలులో పెట్టినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ బలంగానే ఉండడాన్ని బీజేపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల లోపు తనతో పాటు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను ఈడీ ద్వారా అరెస్టు చేయిస్తారని అతిశీ చెప్పారు.