- జగన్ తరఫున నామినేషన్ వేసిన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్
- ఈ నెల 25న జగన్ స్వయంగా మరో సెట్ నామినేషన్ వేస్తారన్న మనోహర్ రెడ్డి
- అనంతరం బహిరంగ సభకు హాజరవుతారని వివరణ
ఏపీ సీఎం జగన్ తరఫున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరఫున ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
అనంతరం వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ తరఫున ఇవాళ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశామని, ఈ నెల 25న సీఎం జగన్ స్వయంగా వచ్చి మరో సెట్ నామినేషన్ వేస్తారని వివరించారు. 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని, అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.
సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. తొలివిడత బస్సు యాత్ర ముగిసిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకుంటారు. ఏపీలో ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది.