సైబర్ క్రైమ్ 3 నిమిషాల వ్యవధిలో కోటి 10 లక్షలు డ్రా …అప్రమత్తమైన కస్టమర్
రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు
సదరు బ్యాంకు కు ఫిర్యాదు చేసిన పోలీసులు
అలర్ట్ అయినా బ్యాంకు సిబ్బంది
బదిలీ అయిన ఖాతాల నుంచి సొమ్ము డ్రా కాకుండా నిలిపివేసిన బ్యాంకు అధికారులు
ఒక్క పదివేలు మాత్రమే కేటుగాళ్లు డ్రా చేయగలిగినట్లు గుర్తించిన బ్యాంకు
బెంగుళూరు నుంచి నిధులు డ్రా
హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు గత నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి. 10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే.. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు.. రూ.10 లక్షలు ఒకసారి.. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది.
తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకున్న అతను.. కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్.. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది.
బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.. నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో.. డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా.. నిమిషాల్లో స్పందించి ‘‘1930’’ కు ఫోన్ చేస్తే.. డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి. అందరిలోనూ 1930 నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం ఉంది.