కొనసాగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్
- ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
- స్థానిక జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు
- మన్నె జీవన్‌రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌లలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఉత్కంఠ
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్థానిక బాలుర జూనియర్ కాలేజీ వేదికగా జరుగుతోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, ఒక టేబుల్‌పై 237 చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి (బీఆర్ఎస్), సుదర్శన్‌గౌడ్ (స్వతంత్ర) ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటు వేశారు. మార్చి 28న ఈ ఉప ఎన్నిక జరగగా ఏప్రిల్ 2న ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడంతో నేడు (ఆదివారం) కౌంటింగ్ జరుగుతోంది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎవరు గెలవబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.